'సందేహం లేదు.. జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్‌'

16 May, 2020 09:10 IST|Sakshi

ముంబై : టీమిండియాలో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో చెలరేగిపోయే ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేరనే చెప్పాలి. ఇది ఇప్పటిమాట కాదు.. క్రికెట్‌లో భారత్‌ ఆట మొదలైనప్పటి నుంచి ఫీల్డింగ్‌  సమస్య అలానే ఉండేది. కొన్ని సార్లు చెత్త ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే భారత జట్టులో అడపాదడపా ఫీల్డింగ్‌లోనూ రాణించే ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తారు. అందులో రాబిన్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, యువరాజ్‌ లాంటి ఆటగాళ్లు ఉండేవారు. ఈ దశాబ్దంలో మాత్రం ఫీల్డింగ్‌లో దశ మారిందనే చెప్పాలి. ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. వారిలో విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు కనిపిస్తారు.
(ఎవరూ బయటకు వెళ్లకండ్రా నాయనా!)

అయితే వీరిలో ఎవరు బెస్ట్‌ ఫీల్డర్‌ అంటే మాత్రం చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది. కానీ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్‌ అంటూ కితాబిచ్చాడు.  'ఒకవేళ మీకు అవకాశమిస్తే డైరెక్ట్‌ త్రో ద్వారా స్టంప్స్‌ను ఎగురగొట్టడంలో విరాట్‌ లేదా జడేజాలో ఎవరిని ఏంచుకుంటారని ' స్టార్‌స్పోర్ట్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నించింది. దీనికి కోహ్లి స్పందిస్తూ.. ' ఇందులో ఏం సందేహం లేదు.. ప్రతీసారి జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్‌.. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం' అంటూ కామెంట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు