సాహో.. షేన్‌ వాట్సన్‌

28 May, 2018 09:25 IST|Sakshi
షేన్‌ వాట్సన్‌ను అభినందిస్తున్న చెన్నై ఆటగాళ్లు

సాక్షి, ముంబై : ‘సింహంతో వేట.. నాతో ఆట’  రెండూ ప్రమాదకరమే.. అన్నచందంగా సాగింది షేన్‌ వాట్సన్‌ బ్యాటింగ్‌... తొలి 10 బంతుల్లో స్కోరు 0... కానీ  తర్వాతి 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 117 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బలమైన బౌలింగ్‌ జట్టుగా పేరున్న సన్‌రైజర్స్‌తో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడిన వాట్సన్‌.. చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అం‍దుకున్న ధోనీ జట్టు, షేన్‌ వాట్సన్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.

‘చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు అభినందనలు. ప్రపంచంలోనే పెద్ద టీ20 టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌ టైటిల్‌కు మీరు అర్హులు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న చెన్నై ఆటగాళ్లకు శుభాభినందనలు. ఈ విజయం తమిళనాడు ప్రజలందరికీ చెందుతుందంటూ’.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మెంటార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెన్నై జట్టును ప్రశంసలతో ముంచెత్తాడు.

‘సూపర్‌ కోచ్‌... సూపర్‌ కెప్టెన్‌.. సూపర్‌ టోర్నమెంట్‌లో సూపర్‌ విజయాన్ని అందుకుందంటూ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ ట్వీట్‌ చేశాడు. ‘అద్భుతమైన ప్రదర్శన చేసిన షేన్‌ వాట్సన్‌.. నీకిదే నా వందనం. మనందరికీ ఎంతో ఇష్టమైన క్రికెట్‌ పండుగ ముగిసింది. లవ్‌ యూ ఇండియా’ అంటూ ఆసీస్‌ క్రికెట్‌ దిగ్గజం మాథ్యూ హెడెన్‌ వాట్సన్‌ను అభినందించారు.

‘ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆటతీరు పట్ల నాకెంతో గర్వంగా ఉంది. మమ్మల్ని పోత్సహించిన అభిమానులకు, సన్‌రైజర్స్‌ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. షేన్‌ వాట్సన్‌ చాలా అద్భుతంగా ఆడాడు. మీరు(సీఎస్‌కే) ఈ విజయానికి అర్హులంటూ’.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశారు. ‘సీఎస్‌కే మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడంలో షేన్‌ వాట్సన్‌ కీలక పాత్ర పోషించాడు’  అంటూ ఐసీసీ అభినందించింది.
 

మరిన్ని వార్తలు