క్యాంప్‌బెల్, హోప్‌ శతకాలు

6 May, 2019 02:50 IST|Sakshi

తొలి వికెట్‌కు 365 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం

వన్డేల్లో ఏ వికెట్‌కైనా రెండో అత్యుత్తమ భాగస్వామ్యం

ఐర్లాండ్‌పై 196 పరుగులతో విండీస్‌ ఘనవిజయం  

డబ్లిన్‌: ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న ముక్కోణపు వన్డే క్రికెట్‌ టోర్నీలో వెస్టిండీస్‌ ఓపెనర్లు జాన్‌ క్యాంప్‌బెల్, షై హోప్‌ పరుగుల వరద పారించారు. ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్‌ 196 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ముందుగా విండీస్‌ 50 ఓవర్లలో 3 వికెట్లకు 381 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్‌ 34.4 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ ఓపెనర్లు క్యాంప్‌బెల్‌ (137 బంతుల్లో 179; 15 ఫోర్లు, 6 సిక్సర్లు), హోప్‌ (152 బంతుల్లో 170; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు వీరిద్దరు ఏకంగా 365 పరుగులు జోడించారు.

ఈ క్రమంలో తొలి వికెట్‌కు 304 పరుగులతో ఇమామ్‌ ఉల్‌ హఖ్‌–ఫఖర్‌ జమాన్‌ (పాకిస్తాన్‌; జింబాబ్వేపై 2018లో) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు భాగస్యామాన్ని క్యాంప్‌బెల్, హోప్‌ బద్దలు కొట్టారు. ఓవరాల్‌గా ఏ వికెట్‌కైనా చూస్తే ఇది రెండో అత్యుత్తమ పార్ట్‌నర్‌షిప్‌. 2015 వరల్డ్‌ కప్‌లో జింబాబ్వేపై గేల్, శామ్యూల్స్‌ (వెస్టిండీస్‌) రెండో వికెట్‌కు జత చేసిన 372 పరుగుల ప్రపంచ రికార్డును అందుకోవడంలో క్యాంప్‌బెల్, హోప్‌ త్రుటిలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరి ధాటికి పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒక వన్డేలో ఇద్దరు ఓపెనర్లు కూడా 150కు పైగా పరుగులు చేయడం కూడా ఇదే మొదటిసారి కాగా, విండీస్‌ తరఫున ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ ముక్కోణపు టోర్నమెంట్‌లో మరో జట్టుగా బంగ్లాదేశ్‌ బరిలో ఉంది.  

మరిన్ని వార్తలు