టీ20 వరల్డ్‌కప్‌-2024కు అర్హత సాధించిన మరో జట్టు

8 Oct, 2023 13:20 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌కు కెనడా క్రికెట్‌ జట్టు తొలిసారి అర్హత సాధించింది. వచ్చే ఏడాది వెస్టిండీస్‌, యూఎస్‌ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచ‌కప్‌లో 16వ జట్టుగా కెనడా బరిలోకి దిగనుంది. రీజియనల్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా బెర్ముడాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన కెనడా తొలిసారి వరల్డ్‌కప్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకుంది. 

టీ20 వరల్డ్‌కప్‌-2024 కోసం ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌.. గత ఎడిషన్‌లో టాప్‌-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌).. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాయి.

మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌ ఇటీవలే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. తాజాగా కెనడా ఆ జట్ల సరసన చేరింది. కెనడా గతంలో ఓసారి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. 2011 ఎడిషన్‌లో ఆ జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యింది. 

ఇదిలా ఉంటే, హ్యామిల్టన్‌లో నిన్న (అక్టోబర్‌ 7) జరిగిన ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ అమెరికా రీజియనల్‌ పోటీల్లో బెర్ముడాపై కెనడా 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన బెర్ముడా 16.5 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. కెనడా బౌలర్‌ కలీమ్‌ సనా (3.5-1-4-3) బెర్ముడాను దారుణంగా దెబ్బకొట్టగా.. బ్యాటింగ్‌లో నవనీత్‌ ధలీవల్‌ (45) రాణించాడు. 

మరిన్ని వార్తలు