మా శాంపిల్స్‌ పరిస్థితి ఏంటి?

25 Aug, 2019 09:59 IST|Sakshi

‘నాడా’కు బీసీసీఐ లేఖ

న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన ల్యాబ్‌ ఎన్‌డీటీఎల్‌పై ఆరు నెలల నిషేధం విధించడంతో ఇప్పుడు భారత ఆటగాళ్ల డోపింగ్‌ పరీక్షలు సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే సేకరించిన నమూనాలను ఏం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో క్రికెటర్ల శాంపిల్స్‌ గురించి బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి ‘నాడా’కు లేఖ రాశారు. నమూనాల పరిస్థితిని వివరించాలంటూ ఆయన కోరారు.

సుదీర్ఘ కాలంగా ‘నాడా’ డోపింగ్‌ పరిధిలోకి రావడానికి అనాసక్తిని ప్రదర్శించిన క్రికెట్‌ బోర్డు ఇటీవలే తమ సమ్మతిని తెలియజేసింది. ‘బీసీసీఐ దేశవాళీ టోర్నీల సమయంలో మా ఆటగాళ్ల శాంపిల్స్‌ సేకరించారు. తాజా సస్పెన్షన్‌ వీటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మాకు చెప్పండి. ఇప్పుడు క్రికెటర్ల నమూనాలను పరీక్షించే స్థితిలో ఎన్‌డీటీఎల్‌ లేదు కాబట్టి వాటిని ఎలా భద్రపరచబోతున్నారో, రాబోయే రోజుల్లో ఎలా పరీక్షించబోతున్నారో తెలియజేయండి’ అని జోహ్రి తన లేఖలో అడిగారు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ నుంచి క్రికెటర్ల శాంపిల్స్‌ తీసుకుంటామని కొద్ది రోజుల క్రితం ‘నాడా’ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు