రూ.8.4 కోట్లు రికార్డు ధర: ఎవరీ వరుణ్‌ చక్రవర్తి?

19 Dec, 2018 11:20 IST|Sakshi
వరుణ్‌ చక్రవర్తి

సాక్షి, హైదరాబాద్‌ : వరుణ్‌ చక్రవర్తి.. నిన్నటి వరకు అంతగా తెలియని పేరు. కానీ మంగళవారం జరిగిన ఐపీఎల్‌ వేలం అతన్నీ ప్రపంచానికి పరిచయం చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరున్ని కూడా చేసింది.  తమిళ ఆల్‌రౌండర్ అయిన వరుణ్‌ చక్రవర్తి.‌. జాతీయ జట్టుకైతే ఇంతవరకు ఆడలేదు. అంతెందుకు రంజీ మ్యాచ్‌ కూడా అడింది ఒక్కటే. అదీ ఈ ఏడాదే. నిజానికి బాల్యం నుంచే అతనేమీ క్రికెట్‌ పిచ్చోడు కాదు. చాలా ఆలస్యంగా తన 13వ ఏట ఆటకు పరిచయమయ్యాడు. 17 ఏళ్ల వయసు వరకు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. కానీ ఆయా వయో విభాగం పోటీల్లో తరచూ అతన్ని నిరాకరించడంతో ఆటకు బైబై చెప్పి ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో ఐదేళ్ల డిగ్రీ పూర్తిచేశాడు. కొన్నాళ్లు ఆర్కిటెక్చర్‌గా పనిచేశాడు.

టెన్నిస్ బాల్‌తో..
అప్పుడప్పుడు టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఆడుతుండటం వల్ల మళ్లీ ఆటపై మనసు పెట్టాడు. అంతే ఈసారి వరుణ్‌ జాబ్‌కు టాటా చెప్పి ఆటకు సై అన్నాడు. క్రోమ్‌బెస్ట్‌ క్రికెట్‌ క్లబ్‌లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా చేరాడు. కానీ మోకాలి గాయంతో పేస్‌ను వదిలేసి స్పిన్నరయ్యాడు. జూబ్లీ క్రికెట్‌ క్లబ్‌ తరఫున చెన్నైలో ఫోర్త్‌ డివిజన్‌ లీగ్‌ క్రికెట్‌ ఆడాడు. గత 2017–18 సీజన్‌లో ఆ క్లబ్‌ జట్టు తరఫున ఏడు వన్డేలాడిన వరుణ్‌ 3.06 ఎకానమీతో 31 వికెట్లు తీశాడు.

టీఎన్‌పీల్‌తో..
బ్యాటింగ్‌లోనూ రాణించే చక్రవర్తి ఈ ఏడాది తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)తో అందరికంటా పడ్డాడు. రెండేళ్లుగా ఒక్క మ్యాచ్‌ గెలవని సీచెమ్‌ మధురై పాంథర్స్‌ను ఈ ఏడాది విజేతగా నిలపడంతో అతని ప్రతిభ బయటపడింది. దీంతో విజయ్‌ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున ఛాన్స్‌ కొట్టేశాడు. అక్కడ 9 మ్యాచ్‌లాడి లీగ్‌ దశలో అత్యధిక వికెట్లు (22) తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్‌–11 సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నెట్స్‌లో బౌలింగ్‌ వేసేవాడు. స్థానిక వివాదం కారణంగా సీఎస్‌కే పుణే వేదికకు మారడంతో కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా... మళ్లీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్, జట్టు విశ్లేషకుడు శ్రీకాంత్‌ల పిలుపుమేరకు ఆ జట్టు నెట్‌ ప్రాక్టీస్‌లో బౌలింగ్‌ చేశాడు. ముంబై ఇండియన్స్‌ ట్రయల్స్‌లోనూ పాల్గొన్నాడు. కానీ ఏమైందో వాళ్లు రిలీజ్‌ చేయడంతో వేలానికి వచ్చాడు. ఈ లక్కీ క్రికెటర్‌ రూ. 20 లక్షల ప్రాథమిక ధర నుంచి ఏకంగా కోట్లు కొల్లగొట్టాడు. ‘రూ. 20 లక్షలకు ఎవరో ఒకరు కొంటారనే నమ్మకం ఉంది. కానీ 40 రెట్లు పలుకుతానని అస్సలు ఊహించలేదు’ అని ఉబ్బితబ్బిబ్బయ్యాడు వరుణ్‌.

సునీల్‌ నరైన్‌ టిప్స్‌..
కోల్‌కతా నైటరైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌కు నెట్‌ ప్రాక్టీస్‌లో బౌలింగ్‌ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు సునీల్ నరైన్ తనకు బౌలింగ్‌లో మెలకువలు నేర్పాడని అవి తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వరుణ్‌ చెప్పుకొచ్చాడు.  ‘క్రికెట్ కెరీర్‌లో తొలి నాళ్లలో నేను వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఆడేవాడిని. ఆ తర్వాత క్రికెట్ మానేసి రెండేళ్ల పాటు వేరే పనిలో నిమగ్నమయ్యాను. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్‌గా మళ్లీ ఆడటం మొదలుపెట్టాను. దాంతో నా మోకాళ్లపై భారం అధికమైంది. ఓ మ్యాచ్‌లో మోకాలికి గాయమైంది. దాంతో ఆర్నెళ్ల పాటు ఆటకు విరామం తీసుకున్నాను. స్పిన్‌ బౌలింగ్‌తో మళ్లీ ఆడటం మొదలు పెట్టాను’ అని వరుణ్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా