లక్ష్యం పెద్దదే.. గెలిస్తే చరిత్రే

8 Mar, 2020 14:00 IST|Sakshi

మెల్‌బోర్న్‌: స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ (78 నాటౌట్‌; 54 బంతుల్లో 10ఫోర్లు) కూల్‌ హాఫ్‌ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ నమోదు చేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా టీమిండియాకు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్‌ నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యం పెద్దదయినా గెలిస్తే టీమిండియా నయా చరిత్ర సృష్టిస్తుంది. దీంతో యావత్‌ భారత్‌ టీమిండియా గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ఘనమైన ఆరంభాన్ని అందించారు. టీమిండియా పస లేని బౌలింగ్‌ చెత్త ఫీల్డింగ్‌ వారికి కలిసొచ్చింది. దీంతో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. దీంతో ఓ క్రమంలో 200కు పైగా భారీ స్కోర్‌ నమోదు చేస్తారని భావించారు. అయితే చివర్లో తేరుకున్న భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టడంతో ఆసీస్‌ను కట్టడి చేయగలిగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.  
 

మరిన్ని వార్తలు