కేన్‌ విలియమ్సన్‌ సెంచరీ

30 Nov, 2023 01:14 IST|Sakshi

న్యూజిలాండ్‌ 266/8 

సిల్హెట్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (104; 11 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఓపెనర్లు లాథమ్‌ (21; 3 ఫోర్లు), కాన్వే (12) విఫలమవగా, ఆతిథ్య బంగ్లా బౌలర్లు పట్టు బిగించడంతో కివీస్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది.

ఈ దశలో విలియమ్సన్‌... డరైల్‌ మిచెల్‌ (41; 3 ఫోర్లు, 1 సిక్స్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (42; 5 ఫోర్లు, 1 సిక్స్‌)లతో జట్టును నడిపించాడు. ఈ క్రమంలో అతను టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం పూర్తయిన కాసేపటికే విలియమ్సన్‌ను తైజుల్‌ ఇస్లామ్‌ బౌల్డ్‌ చేయడంతో 262 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా నిష్క్రమించాడు.

ఆట ముగిసే సమయానికి జేమీసన్‌ (7 బ్యాటింగ్‌), కెప్టెన్‌ టిమ్‌ సౌతీ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. షోరిఫుల్, మెహదీహసన్‌ మిరాజ్, నయీమ్‌ హసన్, మొమినుల్‌ తలా ఒక వికెట్‌ తీశారు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌటైంది.  

మరిన్ని వార్తలు