నా జట్టులో అయితే అతనుండాలి: కోహ్లి

24 May, 2019 18:47 IST|Sakshi

లండన్‌: దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం అందరి దృష్టి ప్రపంచకప్‌పై పడింది. ఇప్పటికే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్‌కు అన్ని జట్లు చేరుకుని ప్రాక్టీస్‌ ప్రారంభించాయి. ఈ మెగా ఈవెంట్‌ ప్రచారంలో బాగంగా అన్ని జట్ల సారథులతో ఐసీసీ ఫోటో షూట్‌ నిర్వహించింది. అనంతంరం అన్ని జట్ల కెప్టెన్లు సరదాగా సంభాషించుకున్నారు. అయితే ‘ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్టులో ఏ ఆటగాడు తమ జట్టులో ఉండాలని కోరుకుంటారు’ అనే విషయం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ను ఎంపిక చేసుకున్నాడు. 

‘నేను ఎప్పుడూ నా జట్టులో డివిలియర్స్‌ లాంటి ఆటగాడు ఉండాలని కోరుకుంటా. కానీ అతడు రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. ప్రత్యర్థి జట్లలలో డివిలియర్స్‌ తర్వాత నాకు నచ్చిన, ఇష్టమైన ఆటగాడు డుప్లెసిస్‌. అందుకే డుప్లెసిస్‌ నా జట్టులో ఉంటే బాగుంటుంది’అంటూ కోహ్లి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక డుప్లెసిస్‌ కూడా విరాట్‌ కోహ్లి వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ తన జట్టులో ఉంటే బాగుంటుందని కోరుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో బౌలర్లు కీలక పాత్ర పోషిస్తారని.. ఈ మధ్య కాలంలో అన్ని ఫార్మట్లలో విశేషంగా రాణిస్తున్న జస్ప్రిత్‌ బుమ్రాను ఎంచుకుంటాని తెలిపాడు. బంగ్లాదేశ్‌ సారథి మొర్తాజా కూడా కోహ్లి తమ జట్టులో ఉంటే బ్యాటింగ్‌ మరింత బలంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 

ఇక న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ రషీద్‌ ఖాన్‌ను, ఆస్ట్రేలియా సారథి ఆరోన్‌ ఫించ్‌ కగిసో రబడను ఎంచుకున్నారు. పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ బట్లర్‌ను, శ్రీలంక సారథి కరుణరత్నే ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను కోరుకున్నారు. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అందిరికంటే భిన్నంగా సమాధానం ఇచ్చాడు. తన జట్టు చాలా బలంగా ఉందని.. అందుకే ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నాడు. పక్కాగా తీసుకోవాలంటే ఆసీస్‌కు సహాయ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్‌ను ఎంపిక చేస్తానని మోర్గాన్‌ తెలిపాడు. 

>
మరిన్ని వార్తలు