ఖేల్‌రత్న బజరంగ్‌

17 Aug, 2019 05:44 IST|Sakshi
బజరంగ్‌ పూనియా

ఏకగ్రీవంగా నామినేట్‌ చేసిన అవార్డు కమిటీ

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా అత్యున్నత క్రీడాపురస్కారమైన ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2018 ఆసియా గేమ్స్‌ (జకార్తా), కామన్వెల్త్‌ గేమ్స్‌ (గోల్డ్‌కోస్ట్‌) చాంపియన్‌ అయిన పూనియాను 12 మంది సభ్యులు గల అవార్డుల కమిటీ ఏకగ్రీవంగా నామినేట్‌ చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ ముకుందకం శర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో భారత క్రీడా దిగ్గజాలు బైచుంగ్‌ భూటియా, మేరీకోమ్‌ తదితరులున్నారు. ఈ కమిటీ రెండు రోజుల సమావేశం శుక్రవారం మొదలైంది. తొలిరోజే చాంపియన్‌ రెజ్లర్‌ను నామినేట్‌ చేయగా, శనివారం మరొకరిని ఈ ‘ఖేల్‌రత్న’కు జతచేసే అవకాశాల్ని కమిటీ పరిశీలిస్తుంది. గతేడాది అత్యున్నత క్రీడాపురస్కారానికి తనను గుర్తించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పూనియా కోర్టును కూడా ఆశ్రయించాడు.

చివరకు మెగా ఈవెంట్లలో అతని బంగారు ప్రదర్శనను గుర్తించిన కమిటీ ఖేల్‌రత్నకు ఎంపిక చేయడం విశేషం. ఎట్టకేలకు తన ఘనతలకు గుర్తింపు దక్కినందుకు స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా హర్షం వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు అవార్డుకు ఎంపిక కావడంకంటే  కూడా తన శక్తి, సామర్థ్యాలే తనకు స్ఫూర్తి, ప్రేరణ అని చెప్పుకొచ్చాడు.  మొత్తం మీద అవార్డుల కమిటీ... అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన అథ్లెట్లు, కోచ్‌లను నేడు ఖరారు చేసి భారత ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. అనంతరం క్రీడాశాఖ అధికారికంగా జాబితాను విడుదల చేస్తుంది. దివంగత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అవార్డుల్ని అందజేస్తారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా