రెజ్లర్లకూ కాంట్రాక్టులు 

1 Dec, 2018 05:15 IST|Sakshi

‘ఎ’ గ్రేడ్‌లో బజరంగ్, వినేశ్, పూజ 

‘బి’ గ్రేడ్‌లో సుశీల్, సాక్షి 

గొండా: భారత్‌లో క్రికెటర్లే కాదు... రెజ్లర్లూ కాంట్రాక్టు ‘పట్టే’శారు. ఇప్పటిదాకా గెలిచినపుడే పతకాలు, ప్రోత్సాహకాలు దక్కేవి. ఇకపై వార్షిక కాంట్రాక్టుల రూపంలో స్థిరమైన మొత్తాలను అందుకోనున్నారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్తగా ఈ కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇంటాబయటా పతకాలు సాధిస్తున్న రెజ్లర్లకు ‘ఎ’, ‘బి’ కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఎ–గ్రేడ్‌లో రూ. 30 లక్షలు, బి–గ్రేడ్‌లో రూ. 20 లక్షలు వార్షిక ఫీజుగా చెల్లిస్తారు. సి, డి గ్రేడ్‌ల్లో ఉన్న రెజ్లర్లకు వరుసగా రూ. 10 లక్షలు, రూ. 5 లక్షలు చెల్లిస్తారు.

ఏటా ఆయా రెజ్లర్ల ప్రదర్శనను సమీక్షించి గ్రేడ్‌లను మారుస్తారు. ఈ కాంట్రాక్టుల్లో యువ స్టార్‌ రెజ్లర్లకు పెద్దపీట వేశారు. బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగాట్, పూజ ధండాలకు ‘ఎ’ గ్రేడ్‌ ఇవ్వగా... వెటరన్‌ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్స్‌ పతక విజేత అయిన సుశీల్‌ కుమార్‌కు ‘బి’ గ్రేడ్‌ కాంట్రాక్టు ఇచ్చారు. ఇదే జాబితాలో రియో ఒలింపిక్స్‌ కాంస్య విజేత సాక్షి మలిక్‌ ఉంది. దేశంలో బీసీసీఐ తర్వాత కాంట్రాక్టు ఇస్తున్న రెండో క్రీడా సమాఖ్య డబ్ల్యూఎఫ్‌ఐనే! భారత ఒలింపిక్‌ సంఘం సభ్య సమాఖ్యల్లో కాంట్రాక్టులు చెల్లిస్తున్న ఏకైక క్రీడా సంఘంగా డబ్ల్యూఎఫ్‌ఐ ఘనతకెక్కనుంది. జూనియర్‌ రెజ్లర్లకు ఇదెంతో ప్రోత్సాహకరమని వినేశ్‌ ఫొగాట్‌ హర్షం వ్యక్తం చేసింది.    

మరిన్ని వార్తలు