‘పంత్‌పై వ్యాఖ్యలు చేయడం ఆపండి’

24 Sep, 2019 15:48 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనికి ప్రత్యామ్నాయంగా యువ వికెట్‌  కీపర్‌ రిషభ్‌ పంత్‌కు పదే పదే జట్టులో స్థానం ఇస్తున్నా విఫలం కావడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికే పలువురు మాజీలు రిషభ్‌ పంత్‌ ఆట తీరును మార్చుకోమని సలహా ఇస్తుండగా, మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు. రిషభ్‌ పంత్‌కు వరుసగా అవకాశాలు ఇస్తుండటంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌ను నేరుగానే ప్రశ్నించాడు. పంత్‌కు ఇచ్చిన అవకాశాలు చాలని, సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలన్నాడు.

కాగా, రిషభ్‌ పంత్‌కు మద్దతుగా నిలిచాడు మాజీ హిట్టర్‌ యువరాజ్‌ సింగ్‌.  పంత్‌పై విమర్శలు చేస్తున్నారు ఇకనైనా కట్టిపెట్టాలంటూ బదులిచ్చాడు.‘ పంత్‌పై వరుసగా వ్యాఖ్యలు చేయడం ఆపండి. ధోనితో పోల్చుతూ, అతనికి ప్రత్యామ్నాయం అంటూ పంత్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ధోని కూడా ఒక్కరోజులోనే అవకాశాలు ఒడిసి పట్టుకోలేదు. ధోని స్థానాన్ని భర్తీ చేయాలంటే పంత్‌కు సమయం పడుతుంది. రిషభ్‌ పంత్‌ ఆట తీరుపై కాస్త ఓపిక పట్టండి. రిషభ్‌ పంత్‌లో మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉంది. అతనిలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కోచ్‌కానీ, కెప్టెన్‌ కానీ పంత్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తే గాడిలో పడితాడు. అనవసరంగా పంత్‌పై కామెంట్లు చేయడం ఆపండి’ అని యువరాజ్‌ సూచించాడు.

>
మరిన్ని వార్తలు