రుణమాఫీ పేరుతో నిలువుదోపిడీ

31 Dec, 2017 09:07 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం 

శ్రీకాకుళం అర్బన్‌: రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి వారిని నమ్మించి అధికారంలోకి వచ్చాక అన్నదాతను నిలువుదోపిడీ చేసిన ఘనత చంద్రబాబుదేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు దుయ్యబట్టారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ పథకం అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతు సాధికారికత సంస్థ ద్వారా రుణ ఉపశమన పథకం లెక్కల్లో మాత్రం లక్షల రూపాయలలు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు చూపిస్తున్నారే తప్ప అందులో వాస్తవం లేదన్నారు. 

ఇందుకు ఉదాహరణగా జిల్లాలోని ఆమదాలవలస మండలంలో కూన రాజు అనే రైతుకు గత రెండు విడతలుగా ఇచ్చామన్న రూ.44,040.25 తన ఖాతాలో జమ కాలేదన్నారు. సరికదా మూడో విడతగా ఇచ్చిన బాండు రూ.10,757.17 ఈనాటికీ రైతు ఖాతాలో జమ కాలేదని చెప్పారు. ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్‌ చేయకపోగా వేలాది మంది తొలగించారని ధ్వజమెత్తారు.ఒకవైపు ఇసుక మాఫియా, మరోవైపు మద్యం మాఫియా, భూమాఫియా ఎటుచూసినా అధికారులపై భౌతికదాడులు, దళితులపై దండయాత్రలు, పనుల్లో అవకతవకలు, కొల్లగొట్టిన వేల కోట్లు రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో అడుగడుగునా అవినీతి ఘటనలే చోటుచేసుకున్నాయని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు టి.కామేశ్వరి, మండవిల్లి రవి, తంగుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు