‘కోస్టల్’తో మత్స్యకారులకు ముప్పే

27 Jul, 2015 02:51 IST|Sakshi
‘కోస్టల్’తో మత్స్యకారులకు ముప్పే

మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందంటున్న నిపుణులు
{పాజెక్టు మొదలైతే అందరూ ఖాళీ చేయాల్సిందే..
{పపంచస్థాయి నిపుణులతో పనులు చేపడతాం: బీఎంసీ
 
 సాక్షి, ముంబై : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కోస్టల్ రోడ్డు ప్రాజెక్టు వల్ల మత్స్యకారుల జీవితం పడనుందా, అంటే అవునునే అంటున్నారు నిపుణులు. సముద్రంలో భారీ ఎత్తున మట్టి పోయడం వల్ల నీరు మత్స్యకారుల వాడల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, వారు మరొక చోటికి తరలిపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. సుమారు 15 కి.మీ. పొడవైన నారిమన్ పాయింట్-కాందివలీ కోస్టల్ రోడ్డు నిర్మాణం మెరైన్ డ్రైవ్, ప్రియదర్శిని గార్డెన్ నుంచి మహాలక్ష్మి వరకు, వర్లీ సీ ఫేస్‌లో సముద్ర మార్గం గుండా వర్సోవా నుంచి కాందివలీ వరకు ఖాడీలో ఉంటుంది.

ఈ మార్గంలో మత్స్యకారులకు ఆటంకం కలగకుండా అక్కడక్కడ వంతెనలు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అయితే చేపల వేటకు సౌకర్యవంతంగా ఉంటుందని నగరంలోని సముద్ర తీరప్రాంతాల వెంబడి అనేక కోళి వాడలు (మత్స్యకారుల బస్తీలు) వెలిశాయి. లాంచీల్లో చేపల వేటకు వెళ్లడానికి, తిరిగి రావడానికి ఈ తీర ప్రాంతాలు వారికి ఎంతో దోహదపడతాయి. కాని సముద్రంలో భారీ స్థాయిలో మట్టి వేసి నిర్మించే రోడ్డు కారణంగా జుహు, మోరాగావ్, తారాగావ్, ఖార్‌దాండ, బాంద్రాలోని చింబయ్ గావ్, నారిమన్ పాయింట్‌లోని బద్వార్ పార్క్ ప్రాంతాల్లోని మత్స్యకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుందని తెలుస్తోంది.

 నిపుణులేమంటున్నారంటే..
 బృహన్‌ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఇంతవరకు ఏ పని సక్రమంగా చేపట్టలేదని, బాంద్రా-వర్లీ సీ లింకు వంతెన పిల్లర్ల కారణంగా దాదర్ చౌపాటి కనుమరుగైపొతోందని పర్యావరణ నిపుణుడు డేబీ గోయంకా అన్నారు. సముద్రపు ఆలల తాకిడి వల్ల 300 ఏళ్ల చరిత్ర ఉన్న మహీం కిల్లా గోడలకు బీటలు వారాయి. కేవలం పిల్లర్లకే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే ఇక సముద్రంలో మట్టివేసి రోడ్డు నిర్మిస్తే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సముద్రంలో మట్టి వేస్తే నీరు చుట్టుపక్కలున్న బస్తీల్లోకి చొచ్చుకుపోతుందని సముద్ర జీవాల అధ్యయనకారుడు సాగర్ కులకర్ణి అన్నారు. మట్టివేసే ముందు భారీ అలల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

 అక్కడ 30 శాతం ఇలానే..
 సింగాపూర్ దేశం 30 శాతం సముద్రంలో భారీ స్థాయిలో మట్టి వేసి నిర్మించినదే. కోస్టల్ రోడ్డు నిర్మాణం కోసం పనులు ప్రారంభించే ముందు ప్రపంచ స్థాయి నిపుణులను నియమిస్తాం. కనీసం రెండు దేశాల్లో ఇలాంటి పనుల్లో అనుభవం ఉన్నవారినే నియమిస్తాం’ అని బీఎంసీ కమిషనర్ అజేయ్ మెహతా తెలిపారు.

మరిన్ని వార్తలు