ఏసీబీ హల్‌చల్‌

8 Dec, 2018 11:27 IST|Sakshi
తిరువళ్లూరు ఆస్పత్రిలో తనిఖీల అనంతరం బయటకు వస్తున్న ఏసీబీ పోలీసులు

ఏకకాలంలో 60 చోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాడులు

సిబ్బంది నుంచి సొమ్ము స్వాధీనం

సాక్షి ప్రతినిధి, చెన్నై: స్టెతస్కోప్‌ పెట్టాలంటే సొమ్ము చెల్లించాల్సిందే. నాడిపట్టుకోవాలంటే కోరినంత ఇవ్వాల్సిందే. బిడ్డ పుడితే అది ఆడా, మగా అని తెలిజేయాలంటే దానికో ప్రత్యేక టారిఫ్‌. మగ బిడ్డపుడితే ఎక్కువ రేటు, ఆడపిల్ల పుడితే తక్కువ రేటు సిబ్బందికి చెల్లించాలి. ఇలాంటి సిబ్బంది పాపం పండడంతో ప్రభుత్వ ఆస్పత్రులపై గురువారం అర్ధరాత్రి ఏసీబీ మెరుపుదాడులు చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రులు, ప్రధాన వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు ప్రతిరోజూ లక్షల సంఖ్యలో రోగులు వైద్యసేవలు పొందుతుంటారు. ముఖ్యంగా 50 శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతుంటాయి. కాన్పుకాగానే బిడ్డ ఆడా లేక మగా అని చెప్పేందుకు ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా సిబ్బంది ఉన్నారు. సదరు సమాచారాన్ని తెలియజేసేందుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని ఆస్పత్రుల్లో మగ బిడ్డ పుట్టినట్లు చెబితే రూ.1500, ఆడబిడ్డ పుడితే రూ.800 వసూలు చేస్తున్నారు. అలాగే స్కాన్‌ సెంటర్లలో నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతిచోట సొమ్ములు చెల్లించాల్సి రావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. వైద్యచికిత్సల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలను పీడించి, మోసగించి సొమ్ముచేసుకుంటున్నట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అనేక ఫిర్యాదులు అందాయి.

అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా..
పగటి పూట వెళితే పెద్దగా ప్రయోజనం ఉండదని భావించారో ఏమో గురువారం అర్ధరాత్రే ఆకస్మికదాడులు ప్రారంభించారు. ఏసీబీ కుప్పలు తెప్పలుగా అందుతున్న ఫిర్యాదులను పురస్కరించుకుని ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వఆస్పత్రి (జీహెచ్‌), కడలూరు, కాంచీపురం, తంజావూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ, ఇతర ముఖ్యమైన ఆస్పత్రుల్లోనూ ఆకస్మికంగా దాడులు ప్రారంభించారు. సుమారు 60 ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. వైద్యులు, నర్సింగ్‌ చాంబర్లలో సోదాలు చేపట్టారు. చెంగల్పట్టు ప్రభుత్వ వైద్యశాలలో జరిపిన సోదాల్లో ఐదుగురు సిబ్బంది నుంచి రూ.12,750 స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాంచీపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏసీబీ డీఎస్పీ శివబాలశేఖరన్‌ నేతృత్వంలో పదిమందితో కూడిన సిబ్బంది గురవారం అర్ధరాత్రే చేరుకోవడంతో సిబ్బంది బెంబేలెత్తిపోయారు. సిబ్బంది అనధికారికంగా దగ్గర ఉంచుకున్న సొమ్ముపై ఆరాతీసి పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారుల దాడులు, తనిఖీల పర్యవసానంగా ఆస్పత్రి అధికారుల్లో కొందరు అరెస్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు