మళ్లీ పేదరిక నిర్మూలన పథకం

10 Jul, 2015 02:53 IST|Sakshi

 సాక్షి, చెన్నై : రాష్ట్రంలో డీఎండీకే నేతృత్వంలో పేదరిక నిర్మూలన పథకం మళ్లీ అమల్లోకి రానున్నది. రెండేళ్ల విరామ అనంతరం ఈ పథకానికి ఆగస్టులో శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు తగ్గ ఆదేశాలు పార్టీ జిల్లాల కమిటీలకు డీఎండీకే అధినేత విజయకాంత్ పంపి ఉన్నారు. సినీ నటుడిగా ఉన్న కాలం నుంచి తన బర్త్‌డేను పేదల సంక్షేమ దినంగా విజయకాంత్ జరుపుకుంటూ వస్తున్నారు. డీఎండీకే ఆవిర్భావం, ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించడంతో ప్రభుత్వాలు అమలు చేయకున్నా, తన పార్టీ నేతృత్వంలో ప్రత్యేక పథకం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. పేదల సంక్షేమ దినంను పేదరిక నిర్మూలన పథకంగా మార్చేశారు. 2012లో రాష్ట్ర వ్యాప్తంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని విజయకాంత్ పర్యటించారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాల పార్టీల నేతృత్వంలో అమలు చేయించి, పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగారు.
 
  అదే సమయంలో వేదికలెక్కి సీఎం జయలలితను టార్గెట్ చేసి విజయకాంత్, ఆయన ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు సాగించిన  ప్రసంగాలు కోర్టుల చుట్టు తిరిగేలా చేశాయి. కోర్టు మెట్లు ఎక్కేందుకే సమయం ఎక్కువగా కేటాయించాల్సి రావడంతో రెండేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేయడంలో డీఎండీకే వర్గాలు వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

 పేదరిక నిర్మూలన పథకం : ప్రతి జిల్లాలో తమ మీద పరువు నష్టం దావాలు దాఖలైనా, రోజుకో కోర్టుమెట్లు ఎక్కాల్సి వచ్చినా పార్టీని , కేడర్‌ను రక్షించుకుంటూ ముందుకు సాగే పనిలో విజయకాంత్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల అనంతరం మళ్లీ పేదరిక నిర్మూలన పథకాన్ని పార్టీ నేతృత్వంలో అమలు చేయడానికి నిర్ణయించారు. ఈ పథకం మేరకు పార్టీ వర్గాలు ఏ మేరకు పేద ప్రజలకు పోటీలు పడి మరీ సంక్షేమ పథకాలు, అభివృది ్ధకార్యక్రమాలు చేపడుతాయో వాళ్లకే రానున్న ఎన్నికల్లో విజయకాంత్ సీట్లు కేటాయిస్తారన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఆగస్టులో విజయకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని మళ్లీ ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టారు.
 
  అన్ని జిల్లాల పార్టీ కార్యదర్శులకు ఇందుకు తగ్గ ఆదేశాలను విజయకాంత్ జారీ చేసి ఉన్నారు. ఆగస్టులో జిల్లాల వారీగా విజయకాంత్ పర్యటన సాగనున్నడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను వేగవంతం చేయాలని, పేద ప్రజల్ని ఆదుకునే రీతిలో సంక్షేమ కార్యక్రమాలకు కార్యచరణ సిద్ధం చేయాలని డీఎండీకే కార్యాలయం నుంచి కార్యదర్శులకు లేఖలు వెళ్లి ఉన్నాయి. దీంతో ఎన్నికలకు సిద్ధం అయ్యే రీతిలో ఆగస్టు నుంచి ఈ పథకం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు విజయకాంత్ సిద్ధమైనా, ఆ పార్టీ వర్గాలు పలు చోట్ల పెదవి విప్పే పనిలో పడ్డారు. ఇందుకు కారణం, ఇప్పటికే పార్టీ కోసం ఇళ్లు గుల్ల చేసుకున్న జిల్లాల కార్యదర్శులు ఆ పార్టీలో అధికం. ఇక రానున్న రోజుల్లో ఈ పథకం కోసం మరెంత వెచ్చించాల్సి వస్తుందోనన్న బెంగ వారిలో బయలుదేరి ఉన్నదట.
 

మరిన్ని వార్తలు