విలీనమా..వ్యూహమా!

21 Apr, 2017 07:25 IST|Sakshi
విలీనమా..వ్యూహమా!

► స్పందించని చిన్నమ్మ
► వేటుపై దినకరన్‌ సానుకూల ధోరణి
► అన్నాడీఎంకేలో పరిణామాలపై అనుమానాలు
► విలీనం ఒక డ్రామా అంటున్న కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌


అమ్మ మరణం తరువాత చీలికలు పేలికలై అనేక మలుపులు తిరిగిన అన్నాడీఎంకే తాజాగా వైరివర్గాల విలీనం దశకు చేరుకుంది. పార్టీలో ముసలానికి ప్రధాన కారణమైన శశికళ కుటుంబంపై వేటువేయడం ద్వారా అన్నాడీఎంకేకు పూర్వవైభవం తెస్తామని చాటుకుంటూ సాగుతున్నది చిత్తశుద్ధితో కూడిన విలీనమా మరేదైనా వ్యూహమా అనే అనుమానాలు నెలకొన్నాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ఎంజీ రామచంద్రన్‌ స్థాపించిన అన్నాడీఎంకే శకం ఇక ముగిసిపోయిందని అందరూ తీర్మానించుకోగా, తాజాగా చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాల వల్ల పార్టీతోపాటూ రెండాకుల చిహ్నం కూడా చేరువకాగలదని ఇరువర్గాలు నమ్ముతున్నాయి. అయితే విలీనం వెనుక కేవలం పార్టీ ప్రయోజనాలేనా..ఇరువర్గాల విలీనం విశ్వసనీయమైనదేనా అనే చర్చ మొదలైంది. అమ్మ మరణం తరువాత అనా«థగా మారిన అన్నాడీఎంకేకు అండగా నిలవ డం ద్వారా తమిళనాడుల వేళ్లూనుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులు కదిపింది. 

సీఎం పన్నీర్‌సెల్వంకు బాసటగా నిలుస్తూ రాజకీయంగా రాజబాట వేసుకోవాలని భావించింది. అయితే బీజేపీ అంచనాలు తారుమారుకాగా శశికళ వర్గం అధికారంలోకి వచ్చింది. ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లినా పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారకపోగా రాజకీయంగా పన్నీర్‌సెల్వం మరింత బలహీనపడిపోయారు. ఇక పూర్తిగా కార్యాచరణలోకి దిగిన కేంద్రం అదనుకోసం వేచిచూడటం ప్రారంభించింది.  సరిగ్గా ఈసమయంలో దినకరన్‌ పలు కేసుల్లో ఇరుక్కోవడం కేంద్రానికి అయాచిత వరాలుగా మారాయి. అవినీతి ఆరోపణల్లో అధికార పార్టీ అడ్డంగా దొరికిపోవడం రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందనే భయం శశికళ వర్గంలో నెలకొంది. ఈ భయానికి ఊతమిస్తూ ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు నాలుగురోజుల క్రితం అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. 

పన్నీర్‌సెల్వం దూరమైన నాటి నుండే తమిళనాడు ప్రభుత్వాన్ని  కేంద్రం టార్గెట్‌ చేసిందని శశికళ వర్గం అనుమానిస్తోంది. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు డీఎంకే ఒకవైపు పొంచి ఉంది. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తే మనుగడ లేదని శశికళ వర్గానికి తెలుసు. చేజేతులా అధికారాన్ని చేజార్చుకునే కంటే శశికళ, దినకరన్‌లపై వేటువేయడం ద్వారా పన్నీర్‌ సెల్వంతో రాజీపడితే కేంద్రంతో సత్సంబంధాలు, ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కూడా దక్కుతాయని ఎడపాడి పన్నాగంగా ఉంది. కేంద్రం కల్పించిన కష్టాల నుండి గట్టెక్కేందుకు పన్నీర్‌సెల్వంను శశికళ వర్గం పావుగా వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు.

తనను బహిష్కరిస్తే ప్రభుత్వాన్ని కూల్చివేసే ఎమ్మెల్యేల బలం ఉందని రెండురోజుల క్రితం హెచ్చరించిన దినకరన్‌ వేటుకు వంతపాడటం, శశికళ నోరుమెదపక పోవడం వెనుక అంతరార్థం ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ వ్యూహం మరోలా ఉంది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే గెలుపు నల్లేరుమీద నడకకాగలదు. కాంగ్రెస్‌ మిత్రపక్ష డీఎంకే అధికారంలోకి వచ్చేకంటే అస్తవ్యస్తంగా తయారైన అన్నాడీఎంకేను దారికితెచ్చుకుని తనకు అనుకూలంగా మలుచుకోవడం మేలనే ఆలోచనతోనే తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ పలుకోణాల్లో వత్తిడిపెంచినట్లు తెలుస్తోంది.

రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకుని తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే వీలీనం వెనుక వ్యూహమని భావించవచ్చు. రాష్ట్రపతి పాలన ప్రమాదం నుంచి గట్టేక్కేందుకు శశికళ వర్గం, తమిళనాడులో జెండా పాతేందుకు బీజేపీ..విలీనానికి వ్యూహకర్తలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

విలీనం ఒక నాటకం: కేంద్ర మంత్రి పొన్‌
కాగా, అన్నాడీఎంకేలోని రెండువర్గాల విలీనం పథకం ప్రకారం ఆడుతున్న నాటకమని కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. నాగర్‌కోవిల్‌లో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, ఏ కారణం చేత విడిపోయారు, నేడు ఏ కారణం చేత విలీనం అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. జయ మరణ మిస్టరీపై విచారణ కమిషన్‌ వేస్తానని పన్నీర్‌సెల్వం చేసిన ప్రకటన విలీనం తరువాత నీరుగారిపోవడమో లేదా కంటితుడుపు కమిషన్‌గా మారడమో జరుగుతుందని ఆయన అన్నారు. అన్నాడీఎంకేలో చీలికలు తేవడం ద్వారా లబ్ది పొందాల్సిన అగత్యం బీజేపీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు