ఎయిర్‌పోర్ట్ మెట్రోకు పెరిగిన ఆదరణ

4 Jan, 2015 22:01 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌కు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. కాగా, గత జూలైలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ మెట్రో నిర్వహణను హస్తగతం చేసుకుంది. అప్పటినుంచి ఈ రైలుకు ప్రయాణికుల్లో ఆసక్తి పెంచేందుకు పలుచర్యలు తీసుకుంది. అందులో భాగంగా టికెట్ ధరను తగ్గించింది. దాంతోపాటు రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు కల్పించడంతో ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఇందులో ప్రయాణించేవారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి సాధించినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, 2013 జూలై నుంచి 2014 జూలై వరకు సరాసరి రోజువారి ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పులేదు. 2013 జూలైలో రోజూ 10,069 మంది ప్రయాణిస్తే, 2014 జూలైలో ఆ సంఖ్య 13,838కి మాత్రమే పెరిగింది. అయితే గత జూలైలో ప్రయాణచార్జీలను తగ్గించిన తర్వాత ఒక్కసారి ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
 
 ఒక్క నవంబర్‌లోనే 5,38,293 మంది ఈ రైలును ఆశ్రయించారు. అంటే సరాసరిన రోజున18 వేల మంది ప్రయాణించినట్లు అధికారికంగా తేలింది. ఈ సందర్భంగా డీఎంఆర్‌సీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. గత జూలై వరకు ఈ రైల్లో ప్రయాణించడానికి కనిష్టంగా రూ.30, గరిష్టంగా రూ.180 టికెట్ ధర ఉండేదన్నారు. కాగా, జూలై నుంచి ఈ ధరలను రూ.20, రూ.100గా మార్చామన్నారు. అలాగే శివాజీస్టేడియం నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్ రైల్‌కు ఫీడర్ బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రైళ్లకు అనుసంధానం చేస్తూ ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలను మార్చామన్నారు. దీంతో ఇటీవల కాలంలో ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని వివరించారు.
 

మరిన్ని వార్తలు