ఫొటోలు తీసింది ఆయనే ..!

26 Jun, 2014 09:15 IST|Sakshi
ఫొటోలు తీసింది ఆయనే ..!

 *రాష్ట్ర ప్రభుత్వానికి సీఐడీ నివేదిక
 *స్పష్టం చేసిన సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ
 *ఔరాద్కర్‌కు  క్లీన్‌చిట్ !
 *న్యాయ పోరాటం చేస్తాం :  రవీంద్రనాథ్
 *ఎస్‌ఐ రవిపై చర్యలకు సిఫార్సు

 
 బెంగళూరు : ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవ రూపును దాలుస్తున్నాయి. ఇందుకు రాష్ట్ర సీఐడీ ఇచ్చిన నివేదికలు అదే స్పష్టం చేస్తున్నాయి. గతనెల ఓ కాఫీ షాప్‌లో యువతుల ఫొటోలు తీశారని కేఎస్‌ఆర్‌పీ ఏడీజీపీ రవీంద్రనాథ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌసిక్ ముఖర్జీకి ఐదు పేజీల నివేదిక సమర్పించామని సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. మే 26న ఉదయం బెంగళూరులోని కన్నింగ్‌హ్యాం రోడ్డులోని ఓ కాఫీ షాప్‌లోకి వచ్చిన కేఎస్‌ఆర్‌సీ ఏడీజీపీ రవీంద్రనాథ్ పక్క టేబుల్‌లో కూర్చున్న యువతిని ఫొటోలు తీశారనే ఆరోపణ తీవ్ర దుమారం రేగింది. కాగా ఆయనపై హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదు చేశారు.

అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం రేగడంతో రాష్ట్ర ప్రభుత్వం కేసు విచారణ మొత్తం సీఐడీకి అప్పగించింది. కేసును ఆది నుంచి జాగ్రత్తగా విచారణ చేసిన సీఐడీ పోలీసులు రవీంద్రనాథ్ మొబైల్‌ను గుజరాత్ గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అంతకు ముందు ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు నగర పోలీస్ కమిషనర్ ఔరాద్కర్‌తో పాటు డీసీపీ రవికాంత్ గౌడ కూడా విచారణ ఎదుర్కొన్నారు. అయితే సీఐడీ పోలీసులు ఔరాద్కర్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. ఏడీజీపీని ఎవ్వరూ లాకప్‌లో వేయలేదని, ఆయనే లాకప్‌లోకి వెళ్లారని సీఐడీ నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే రవీంద్రనాథ్‌పై హైగ్రౌండ్స్ పోలీసులు సెక్షన్ 354, 506, 509 కింద కేసులు నమోదు చేశారు. అయితే సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికలో సెక్షన్ 509 మాత్రమే రవీంద్రనాథ్‌పై కేసు నమోదు చెయ్యాలని సిఫార్సు చేసింది.  

 ఎస్‌ఐని సస్పెండ్ చెయ్యండి : సీఐడీ
 *ఈ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన హైగ్రౌండ్స్ పీఎస్ ఎస్‌ఐ రవిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ నివేదికలో పేర్కొంది. ఉన్నతాధికారి అని తెలిసి కూడా దురుసుగా వ్యవహరించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

 కోర్టును ఆశ్రయిస్తాం :  న్యాయవాదులు
* ఏడీజీపీ రవీంద్రనాథ్‌పై నమోదైన సెక్షన్ 354, 506లను సీఐడీ అధికారులు తొలగించారని, ఈ కేసు నుంచి ఆయనను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలి న్యాయవాదులు పేర్కొన్నారు. కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

 నేను ఫొటోలు తియ్యలేదు :  ఏడీజీపీ
*యువతి ఫొటోలు తాను తియ్యలేదని ఏడీజీపీ రవీంద్రనాథ్ అంటున్నారు. అనవసరంగా తనపై కేసు నమోదు చేశారని, కోర్టును ఆశ్రయిస్తామని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.  


 

మరిన్ని వార్తలు