అందరివాడవుతున్న ‘అరవిందుడు’

17 Jul, 2017 16:08 IST|Sakshi
అందరివాడవుతున్న ‘అరవిందుడు’

►సీఎం కేజ్రీవాల్‌ వైఖరిలో స్పష్టమైన మార్పు
►రాజకీయ విమర్శల జోలికి వెళ్లని వైనం
►ఢిల్లీ అప్‌డేట్స్‌కే పరిమితమైన కేజ్రీవాల్‌ ట్వీటర్‌ అకౌంట్‌
►సీఎం వైఖరిలో మార్పుపై ఆప్‌లో విస్తృత చర్చ


న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తరచుగా ట్విటర్‌లో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. ఇతర ప్రత్యర్థులపైనా సందర్భానుసారం విరుచుకుపడుతుండేవారు. కానీ, రెండు నెలలుగా ఆయన ట్వీటర్‌ అకౌంట్‌ మూగవోయింది. అందులో ఢిల్లీ అప్‌డేట్స్‌ తప్ప అందులో మరేమీ ఉండడం లేదు. ఇంతకీ కేజ్రీవాల్‌ ఏం చేస్తున్నారు? దేశవ్యాప్తంగా ‘మార్పు’ తీసుకొస్తానన్న ఆయన ఆ దిశగానే పయనిస్తున్నారా!? లేక తానే మారుతున్నారా!? రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఎటు? అధికార, ప్రతిపక్షాలు ఏవైనా ఆయనను సంప్రదించాయా!? ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి. పంజాబ్‌ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్‌ రాజకీయ విమర్శలు, కార్యకలాపాలు ఏమీ లేవు.

కనీసం కేజ్రీవాల్‌ మీడియాతో కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. ఇప్పుడు ఢిల్లీ కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆయన పూర్తిగా ఢిల్లీ పాలనకే పరిమితమయ్యారని, ప్రజలతో వచ్చిన గ్యాప్‌ను పూరిస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు చిన్న చిన్న పార్టీలను కూడా సంప్రదిస్తున్నాయి. కానీ, ఆయా నేతలు కేజ్రీవాల్‌ను మాత్రం సంప్రదించలేదని అంటున్నారు. ఈ దశలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ఇచ్చేది లేదని, కచ్చితంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని పార్టీ అధిస్టానం ఆలోచన చేస్తున్నట్లు ఆప్‌ కీలక నేత ఒకరు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఎమ్సీడీ ఎన్నికల ఫలితానంతరం కేజ్రీవాల్‌ మీడియాతో కూడా మాట్లాడటం తగ్గించేశారు. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి తాను ఢిల్లీ పాలనపైనే దృష్టి పెడతానని, రాజకీయ విమర్శలు చేయబోనని, తన పనితనాన్ని కేవలం చేతలతోనే చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్లుగానే అప్పటనుంచి ప్రధాని మోదీపై ఆయన విమర్శలు తగ్గించి కేవలం ఢిల్లీ పాలనపైనే దృష్టి సారించడం గమనార్హం.

ఢిల్లీలో ప్రతీ గల్లీలోని ఆయన పర్యటిస్తూ ప్రజలతో ఎక్కడిక్కకడ మమేకం అవుతున్నారు. దీన్ని ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని..ఎన్నికల్లో భిన్నమైన తీర్పునిచ్చే ఢిల్లీ ఓటర్ల మద్దతు ఆప్‌వైపే ఉంటుందని సదరు నేత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేజ్రీవాల్‌ వ్యవహారశైలిలో మార్పుపై ఆప్‌లో విస్తృతమైన చర్చ నడుస్తోంది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా