సిద్ధూ.. హద్దు మీరుతున్నావ్‌

21 Aug, 2017 08:45 IST|Sakshi
సిద్ధూ.. హద్దు మీరుతున్నావ్‌
► కక్ష సాధింపు రాజకీయాలు తగవు
► కేంద్రమంత్రి సదానందగౌడ 

శివాజీనగర(కర్ణాటక):  మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఏసీబీని ప్రయోగించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి డీ.వీ.సదానందగౌడ ఆరోపించారు. అధికార అహంకారానికి, రాజకీయ స్వలాభానికి పరిమితులు ఉన్నాయని, అయితే సిద్ధరామయ్య అన్ని హద్దులను దాటి స్వార్థం కోసం ఏసీబీని వాడుకొంటూ దుర్వినియోగానికి పాల్పడటం సరైన విధానం కాదన్నారు. ఆదివారం మహాలక్ష్మీపురంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన పరిసర పరిరక్షణ గణేశ్‌ జాగృత కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, పలు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు, ఇలాంటి వ్యక్తి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడటంపై దేశమంతా కూడా చర్చనీయాంశమైనదని తెలిపారు.  
 
అధికారం శాశ్వతం కాదు 
యడ్యూరప్పను అణచివేసేందుకు సిద్ధరామయ్య కుట్ర ఫలించదని, ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పటం తథ్యమని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, దీనిని సిద్దరామయ్య తెలుసుకోవాలని సదానంద అన్నారు. ధనబలంతో సిద్ధరామయ్య కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇదే ఆయనకు ఎదురుదాడి అవుతుందని సదానందగౌడ తెలిపారు. ఏసీబీని, అధికారులను దుర్వినియోగం చేసుకోవటంపై కేఏఎస్‌ అధికారి ఒకరు ఫిర్యాదు చేయటం సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుందన్నారు. ప్రకృతికి హానిచేయని రీతిలో వినాయక చవితిని ఆచరించాలని కేంద్రమంత్రి సూచించారు.   
మరిన్ని వార్తలు