దీని వెనుక 700 ఏళ్ల ఘన చరిత

9 Mar, 2020 11:21 IST|Sakshi
రథోత్సవానికి సిద్ధమవుతున్న తేరు

హొసూరు చంద్రచూడేశ్వర స్వామి రథం విశిష్టత

నేడు బ్రహ్మ రథోత్సవం

సాక్షి, హోసూరు: హోసూరు, డెంకణీకోట తాలూకాలలో అతి పెద్ద తేరులలో రెండవది హోసూరు శ్రీ మరకతాంబ చంద్రచూడేశ్వరస్వామి రథం. ఈ రథం వెనుక 701 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు నేటికీ తేరుపై ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. క్రీ.శ. 1319వ సంవత్సరంలో చంద్రచూడేశ్వరస్వామి రథాన్ని నిర్మించినట్లు, అనంతరం కొద్ది కారణాల వల్ల 1753వ సంవత్సరంలో పునఃనిర్మాణం చేపట్టినట్లు రథంపై ఆధారాలున్నాయి. ఈ ఆధారాలు తెలుగు, కన్నడ భాషల్లో రాసి ఉండడం విశేషం. 701 సంవత్సరాల పాతదైనా రథం కొత్తగా కనిపిస్తుంది. టేకు, మత్తి తదితర నాణ్యమైన కలపతో తేరు తయారైంది.   

తుప్పు పట్టని గొలుసులు 
రథ ప్రాముఖ్యతపై, చంద్రచూడేశ్వరస్వామి ఆలయ విశిష్టతపై బ్రహ్మండపురాణంలో ఆధారాలు లభిస్తున్నాయి. రథానికి వినియోగించే ఇనుప గొలుసులను లండన్‌లో తయారు చేశారు. నేటికీ ఆ గొలుసులు తుప్పుపట్టకపోవడం గమనార్హం. తాలూకా కేంద్రం డెంకణీకోట బేడరాయస్వామి రథం ఎత్తు మొదటి స్థానంలో ఉండగా చంద్రచూడేశ్వరస్వామి రథం రెండవ స్థానంలో ఉంది. శ్రీ మరకతాంబసమేత చంద్రచూడేశ్వరస్వామి ఆలయం హోసూరు, డెంకణీకోట, సూళగిరి తాలూకాల వారికే కాక ఇతర రాష్ట్రాల వారు కూడా కులదేవతగా ఆరాధిస్తున్నారు. శ్రీ చంద్రచూడేశ్వరస్వామి ఆలయ రథోత్సవం నేడు సోమవారం ఘనంగా జరగనుంది. రెండవ రోజు మంగళవారం పల్లక్కీ ఉత్సవాలు, తెప్పోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
 
 

మరిన్ని వార్తలు