వినోద పన్ను రద్దు?

25 Sep, 2017 08:42 IST|Sakshi

త్వరలో ఉత్తర్వులుథియేటర్లకు ఊరట

సాక్షి, చెన్నై: సినిమా థియేటర్లకు విధిస్తున్న వినోదపు పన్ను రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గ ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని సినిమా థియేటర్లకు ప్రభుత్వం ఆదేశాలమేరకు కార్పొరేషన్, నగర, పురపాలక సంస్థలు, పట్టణ, తదితర పంచాయతీల ద్వారా వినోద పన్ను వసూళ్లు సాగుతున్న విషయం తెలిసిందే.

ఈ వినోద పన్ను ముప్ఫై శాతం మేరకు అమల్లో ఉంది. అయితే, జూలైలో దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమల్లోకి రావడంతో థియేటర్ల యాజమాన్యంలో ఆందోళన బయలుదేరింది. అన్ని రకాల పన్నులు ఒకే గొడుగు నీడలోకి వచ్చినా, వినోద పన్ను అనేది రాష్ట్రంతో ముడిపడి ఉండడంతో ఆందోళన బయలుదేరింది. జీఎస్‌టీ రూపంలో రూ.100కు పైగా ఉన్న టికెట్టుకు 28 శాతం, వంద వరకు ఉన్న టికెట్లకు 18 శాతం పన్ను అమల్లోకి వచ్చింది.ఈ పన్ను అమలుతో రూ.120గా ఉన్న టికెట్లు రూ.150గాను , రూ.100 ఉన్న టికెట్లు రూ.120గాను, రూ.80గా ఉన్న టికెట్లు రూ.100కు పెరిగాయని చెప్పవచ్చు.

జీఎస్‌టీతో పాటుగా వినోద పన్ను సైతం చెల్లించాల్సి రావడంతో థియేటర్ల సంఘాలు ఏకమైన పోరుబాటను సైతం సాగించాయి. ఒక టికెట్టుకు తాము 58 శాతం మేరకు పన్ను చెల్లించాల్సి ఉన్న దృష్ట్యా, టికెట్ల ధరల్ని మరింతగా పెంచాల్సి ఉందని, ఇది ప్రజల మీద భారం అవుతోందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ ఆందోళనలతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. అధికారులు, పలువురు మంత్రులతో కూడిన ఈ కమిటీ వినోద పన్ను విషయంగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ముందుకు సాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కమిటీ తన పరిశీలనను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఉంది. అందులోని వివరాల మేరకు వినోద పన్ను రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

అయితే, వినోద పన్ను రద్దు చేసిన పక్షంలో నగర, పురపాలక, పట్టణ తదితర పంచాయతీల ఆదాయానికి గండి పడే అవకాశం ఉందన్న వాదనను అధికార వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉన్నాయి.అయితే, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఆ ఆదాయాన్ని రాబట్టుకునే రీతిలో మరికొన్ని సూచనలు ఇచ్చి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వినోద పన్ను రద్దుచేసినా, ఆదాయానికి గండి పడకుండా, త్వరలో  ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు