కెప్టెన్‌కు ఆఫర్!

4 Mar, 2014 12:56 IST|Sakshi
కెప్టెన్‌కు ఆఫర్!

* చేతికి చిక్కేనా?
 * రెండు రోజుల్లో నిర్ణయం
  *చెన్నైకు విజయకాంత్
 
 సాక్షి, చెన్నై:  డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధం అయ్యారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్ డీఎండీకే యువజన నేత సుదీష్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సింగపూర్ నుంచి విజయకాంత్ రాగానే, తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని డీఎండీకే వర్గాలు పేర్కొన్నాయి.


 డీఎండీకే అధినేత విజయకాంత్‌కు లోక్‌సభ ఎన్నికలు డిమాండ్‌ను పెంచాయి. ఆ పార్టీకి ఉన్న పది శాతం ఓటు బ్యాంక్ తమకు కలిసి రావాలన్న కాంక్షతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఉరకలు తీస్తున్నాయి. తొలుత కాంగ్రెస్, డీఎండీకే, డీఎంకేల నేతృత్వంలో కూటమి ఆవిర్భవిస్తుందని సర్వత్రా భావించారు. అయితే, ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్రంగానే శ్రమించింది. ఆయన నిర్ణయాలకు అంగీకరించడంతో పాటుగా ఢిల్లీ వేదికగా మంతనాలు జరిగి ఉన్నాయి. బీజేపీ సీనియర్లతో డీఎండీకే యువజన నేత సుదీష్ చర్చలు సైతం జరపడంతో ఇక ఆ కూటమిలోకి డీఎండీకే వెళుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, బీజేపీ వెంట డీఎండీకే వెళ్ల కుండా కాంగ్రెస్ ప్రయత్నాలు వేగవంతం చేసింది.
 
 కాంగ్రెస్ ఆఫర్: విజయకాంత్ వస్తే, ఎన్నికల అనంతరం ఆయన ఏ కోరిక కోరినా ఇచ్చే ఆఫర్‌ను కాంగ్రెస్ ప్రకటించినట్టు తెలిసింది. తన ప్రతినిధి రాజ్యసభలో అడుగు పెట్టాలన్న ఆశతో విజయకాంత్ ఉన్న విష యం తెలిసిందే. అదే సమయంలో ఎన్నికల బరిలో నిలబడే తమ అభ్యర్థుల ఖర్చును సైతం భరించేందు కు ముందుకు రావాలన్న డిమాండ్‌ను జాతీయ పార్టీలకు కెప్టెన్ చెప్పారు. విజయకాంత్ అనేక డిమాండ్లు పెట్టినా, అందులో కొన్నింటికి బీజేపీ తలొగ్గింది. అయి తే, సీట్ల పందేరం వద్ద వివాదం సాగుతుండడంతో పొత్తుల ప్రకటనపై జాప్యం నెలకొంది. దీన్ని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం విజయకాంత్ గాలం వేసింది. డీఎంకే తమతో కలసి వచ్చినా, రాకున్నా డీఎండీకే, కాంగ్రెస్‌లు కలసి కట్టుగా అభ్యర్థులు నిలబెట్టి సత్తాను చాటే రీతిలో వ్యూహ రచన చేస్తున్నారు.  
 
 మంతనాలు: విజయకాంత్ తమ ముందు గతంలో ఉంచిన డిమాండ్లన్నింటికీ తలొగ్గేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు కాంగ్రెస్ నేతలు సుదీష్‌తో ఆదివారం భేటీ కావడంతో పాటుగా సోనియాగాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్‌తో ఫోన్లో మాట్లాడించినట్టు తెలిసింది. విజయకాంత్ చెన్నైకు రాగానే, తనతో మాట్లాడించాలని సుదీష్ దృష్టికి అహ్మద్ పటేల్ తీసుకెళ్లినట్టు సమాచారం. సుదీష్ చెంతకు వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ పెద్దలు విజయకాంత్  చెన్నైకు రాగానే, ఆయన ఇంటి మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు.

డీఎండీకేకు రాజ్యసభ సీటుతో పాటుగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పక్షంలో మంత్రి పదవుల్ని సైతం ఆఫర్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. అయితే, ఈ ఆఫర్‌కు విజయకాంత్ తలొగ్గేనా? అన్నది రెండు రోజుల్లో తేలే అవకాశం ఉంది. సింగపూర్ వెళ్లిన విజయకాంత్ సోమవారం అర్ధరాత్రి లేదా, మంగళవారం చెన్నైకు చేరుకునే అవకాశం ఉందని, రెండు రోజుల్లో పొత్తులపై తన నిర్ణయాన్ని తమ నేత తప్పకుండా ప్రకటిస్తారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే వెంకటేషన్ పేర్కొనడం గమనార్హం.
 
 
 

మరిన్ని వార్తలు