సర్వేల్లో నిజమెంత?.. తెలంగాణలో గెలుపెవరిది?

29 Nov, 2023 08:29 IST|Sakshi

జనం ఆసక్తిని ఆసరాగా చేసుకుని..: స్వతహాగానే ఎన్నికల సర్వేలంటే జనంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో.. ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉందన్న మాట ఎక్కువగా వినిపిస్తున్నందున, ఈ రెండు పార్టీల్లో దేని ఆధిపత్యం ఎంతన్న విషయాన్ని ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి.

క్షేత్రస్థాయిలో పర్యటనలు లేకుండా, ఇంట్లో కూర్చుని తోచిన అంకెలు వేసుకుంటూ సర్వేల పేరుతో బోగస్‌ సంస్థలు ఫలితాలను సోషల్‌ మీడియాలో ఉంచుతున్నాయి. ఇళ్లలో కూర్చుని అంకెల గారడీ చేసే క్రమంలో ఎన్నో పొరపాట్లు నమోదవుతున్నాయి. పోటీలో లేని పార్టీ పేరు, పోటీలో లేని అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తుండటమే వాటి డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక మరికొందరు ఘనులు..  అప్పటికే వెల్లడైన నాలుగైదు సర్వే ఫలితాలను బేరీజు వేసి, అన్నింటిని జోడించి అటూ ఇటూ మార్చి సర్వే ఫలితాలంటూ వివరాలను పోస్ట్‌ చేస్తున్నారు. సర్వే ఫలితాలను చాలామంది అనుసరించే వీలుండటంతో ఎక్కువ వ్యూస్‌ కోసం ఈ మాయ చేస్తున్నారు. దీంతో జనం వేటిని విశ్వసించాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు.

సర్వే సంస్థల పేరు ధ్వనించేలా..:
ప్రతి ఎన్నికల్లో శాస్త్రీయంగా సర్వే చేస్తూ కొన్ని సంస్థలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి. వాటికి ప్రత్యేకంగా నెట్‌వర్క్‌ ఉంటుంది. ఒక నియోజకవర్గంలో ఎన్ని శాంపిల్స్‌ సేకరించాలి, ఒక ఊరిలో ఎన్ని ఇళ్లను కవర్‌ చేయాలి, అందులో పురుషులెందరు, మహిళలెందరు, ఎన్ని ఇళ్లకో శాంపిల్‌ సేకరించాలి.. లాంటి శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుంటారు. వీటిని ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఆ సర్వే సంస్థల పేరుకు ముందో, వెనకో మరో పదాన్ని జోడించి కొన్ని బోగస్‌ సంస్థలు సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్‌ 

మరిన్ని వార్తలు