‘సత్యభామ’లో భారీగా బలగాల మోహరింపు

24 Nov, 2017 04:04 IST|Sakshi

చెన్నై : తెలుగు విద్యార్థిని మౌనిక(18) ఆత్మహత్యతో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం అట్టుడుకుతోంది. దీంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీలో విధ్వంసం సృష్టించారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు జనవరి 2 వరకూ సెలవులు ప్రకటించింది. గురువారం తెల్లవారుజామునే విద్యార్థులతో యూనివర్సిటీ హాస్టళ్లను ఖాళీ చేయించి ఇళ్లకు పంపేసింది.

యూనివర్సిటీలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. కాగా, ఈ మధ్యాహ్నం మౌనిక మృతదేహానికి రాయపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. మౌనిక కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని సొంత ఊరు నెల్లూరు తీసుకెళ్లారు. తన కూతురి ఆత్మహత్యకు యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని మౌనిక తండ్రి రాజారెడ్డి ఆరోపించారు.

యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మౌనిక తప్పు చేస్తే అందరి ముందూ కాకుండా పక్కకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ చేసుంటే తాను బ్రతికుండేదని అన్నారు. అవమాన భారంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.

అసలేం జరిగింది..
రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ లో కాపీ కొట్టిందని మౌనిక(ఫస్టియర్‌ బీటెక్‌ సీఎస్‌ఈ)ను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక.. మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లైతే బ్రతికివుండేది..

కాపీ కొట్టిందని మౌనికను పరీక్ష హాల్‌ నుంచి ఇన్విజిలేటర్‌ బయటకు పంపించినట్లు మౌనిక సోదరుడు రాకేష్‌ తెలిపారు. రాకేష్‌ కూడా సత్యభామ విశ్వవిద్యాలయంలోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఆ తర్వాత మౌనికను తాను బయటకు తీసుకెళ్లానని, మౌనిక ఎవరినో కలిసి వచ్చినట్లు వెల్లడించారు. యూనివర్సిటీ అధికారుల పర్మిషన్‌ లేకుండా హాస్టల్‌ గదికి వెళ్లకూడదని, అయితే మౌనిక హాస్టల్‌కు వెళ్లిందని ఎలా వెళ్లిందో తనకు తెలియదని వివరించారు.

హాస్టల్‌ గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే, ఆ సమయంలో తాను పరీక్ష హాల్‌లో ఉన్నట్లు చెప్పారు. పరీక్ష ముగిసిన తర్వాత విషయం తెలియడం పరిగెత్తకుంటూ మౌనిక హాస్టల్‌ గదికి వెళ్లినట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది తనను తొలుత లోపలికి వెళ్లనివ్వలేదని, పది నిమిషాల తర్వాత గదిలోకి వెళ్లి మౌనికను చూసినట్లు చెప్పారు. అప్పటికే మౌనిక ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. కాపీ కొడితే అందరిలో అవమానించకుండా, కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు అయితే మౌనిక బ్రతికేవుండేదని అన్నారు.

మరిన్ని వార్తలు