ఎమ్మెల్యే టికెట్‌పై కార్పొరేటర్ల కన్ను

19 May, 2014 23:28 IST|Sakshi

సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మోడీ హవా స్పష్టంగా ప్రతిబింబించిన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు భావిస్తున్నారు. తాము కూడా ఎమ్మెల్యేలు కావాలని వారంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోడీ ప్రభంజనం కారణంగా నగరంలోని మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి చేజారిపోయాయి. శివసేన, బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఈ ఫలితాలు సీనియర్ నాయకులు, సిట్టింగ్‌లు, మాజీ కార్పొరేటర్లతోపాటు కార్యకర్తల్లోనూ నూతనోత్తేజాన్ని నింపింది.

దీంతో వీరంతా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ తనదైన ప్రసంగాలతో ప్రజలను మరింత జాగృతం చేశారు. ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. దీంతో బీజేపీని విజయలక్ష్మి వరించింది. ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ప్రభావం కారణంగా సీట్లు చేజారిపోవచ్చని బీజేపీ, శివసేన నాయకులు తొలుత భావించారు. అయితే శివసేన అభ్యర్థులకు భారీగా ఓట్లు రావడంతో బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తల్లో మనోధైర్యం మరింత బలపడింది. త్వరలో  శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ ఎన్నికలపైకూడా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల బరిలోకి దిగి ఎమ్మెల్యే కావాలని సీనియర్ నాయకులు, సిట్టింగ్, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు భావిస్తున్నారు.

 ఇందులోభాగంగా వారంతా ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన కొందరు పదాధికారులు, కార్పొరేటర్లు అయ్యారు. ఇక గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లాలని కలలు కంటున్నారు. టికెట్ దొరికితే విజయం అత్యంత సునాయాసమనే ధీమాతో ఉన్నారు. ఇలా పెద్ద సంఖ్యలో సీనియర్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలు టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశముంది. భవిష్యత్తులో కొత్త కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదముందని బీజేపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

మరిన్ని వార్తలు