యమునా నదిని పరిరక్షించుకుందాం

14 Dec, 2014 22:12 IST|Sakshi

న్యూఢిల్లీ: యుమునా పరివాహక ప్రాంతాన్ని  పరిరక్షించడానికి వాలంటీర్లు నడుంబిగించారు. సుమారు 1,000 మంది వాలంటీర్లు, వివిధ కాలేజీల విద్యార్థులు ఆదివారం నదీ పరిసరాలను పరిరక్షించాలని కోరుతూ నగరంలో సైకిల్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు 500 సైక్లిస్టులు 18 కిలోమీటర్ల దూరం ర్యాలీ చేపట్టారు. ఉత్తర ఢిల్లీలోని కశ్మీరీగేట్ నుంచి కుడిసియా ఘాట్ వరకు ర్యాలీ సాగింది. అక్కడికి వెళ్లగానే వీరితోపాటు మరికొందరు వాలంటీర్లు కలిసి నదీ పరిసరాలను పరిశుభ్రం చేశారు.
 
 స్వచ్ఛ్‌భారత్’ను ముందుకు తీసుకొని పోవాలని నిర్వాహకులు యువతను కోరారు. యువజన, క్రీడల మంత్రిత్వశాఖ, యూఎన్‌డీపీ, పౌర సంఘాలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. ప్రధాని ప్రవేశపెట్టిన స్వచ్ఛ్‌భారత్  అభియాన్‌పై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని యువజన క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ గుప్తా తెలిపారు. దేశంలో అత్యధిక కలుషితమైన నదుల్లో యమునా ఒకటి అని పలు సర్వేలు వెల్లడించాయి. ఢిల్లీ పరిసరాల్లో మరింత ప్రమాదకరంగా మారింది. నదీ పరిరక్షణకు యువత నడుం బిగించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
 

మరిన్ని వార్తలు