నిబంధనల్ని ఉల్లంఘించిన క్యాబ్ డ్రైవర్లకు జరిమానా | Sakshi
Sakshi News home page

నిబంధనల్ని ఉల్లంఘించిన క్యాబ్ డ్రైవర్లకు జరిమానా

Published Sun, Dec 14 2014 10:09 PM

rules Violation Cab drivers fined in New Delhi

న్యూఢిల్లీ: నగరంలో అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా స్థానిక పోలీసు శాఖ అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన సంబంధిత అధికారులు వారం వ్యవధిలో నిబంధనలను ఉల్లంఘించిన 500 మంది క్యాబ్ డ్రైవర్లకు జరిమానా విధించారు. మరో నాలుగు వేల మందికి చలాన్లు కూడా రాశారు. కాగా ఉబర్ అత్యాచార ఘటన అనంతరం నగరంలో నడుస్తున్న యాప్ ఆధారిత క్యాబ్ సంస్థలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి విదితమే. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ తరచూ ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నామని, ఈ కసరత్తు మున్ముం దు కూడా కొనసాగుతుందని అన్నారు. ఉబర్‌తోపాటు రేడియో ఆధారిత క్యాబ్ సేవలను పూర్తిస్థాయిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నిషేధించి, మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించడమే తమ లక్ష్యమన్నారు.
 
 22 నుంచి  శిక్షణా తరగతులు
 లింగ వివక్షపైనగరంలోని క్యాబ్ డ్రైవర్లకు  పోలీసు శా ఖ అవగాహనా కార్యక్రమం నిర్వహించనుంది. ఉబర్ క్యాబ్‌లో మహిళా ఉద్యోగినిపై అత్యాచార ఘటన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిట్నెస్ పత్రాలు పొందాలంటే ఈ కార్యక్రమంలో తప్పనిసరి.పాల్గొనాల్సి ఉంటుంది. ఈ విషయమై రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా శిక్షణా తరగతులను నిర్వహించనుంది. వీటికి హాజరైన వారికి పత్రాలను అందజేస్తాం. ఫిట్నెస్ పత్రాలకోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో క్యాబ్ డ్రైవర్లు వీటిని విధిగా చూపించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం రెండు గంట లపాటు జరుగుతుందన్నారు. అన్నిరకాల క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 22వ తేదీనుంచి ఈ తరగతులుమ మొదలవుతాయన్నారు. మహిళా ప్రయాణికులకు తగినంత భద్రత కల్పించడమే తమ లక్ష్యమన్నారు.
 
 ఎన్జీఓలకూ భాగస్వామ్యం
 శిక్షణా తరగతుల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేశామని రవాణా శాఖ ఉన్నతాధికా రి తెలిపారు. సరైకలేఖాన్ ప్రాంతంలోని లోణి రోడ్డులోగల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చి సంస్థ ప్రాంగణంలో ఈ తరగతులు జరుగుతాయన్నారు.
 
 ట్విటర్‌లో తాజా సమాచారం
 న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖ చరిత్రలోనే ఇది తొలిసారి. ఉబర్ క్యాబ్‌లో అత్యాచార కేసుకు సంబంధించిన తాజా సమాచారాన్ని డీసీపీ మధుర్ వర్మ ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. అత్యాచార ఘటన జరిగిన ప్రదేశం వర్మ పరిధిలోనే ఉంది. డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార కేసుకు భిన్నంగా ఈ కేసు విచారణ ఆగమేఘాలపై సాగుతోంది. బాధితురాలికి పోలీసు శాఖ రూ. లక్ష పరిహారం అందజేసేందుకు ముందుకొచ్చినప్పటికీ ఆమె తండ్రి నిరాకరించిన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి ఉబర్ ఏసియా విభాగాధిపతి ఎరిక్ అలెగ్జాండర్‌ను తమ సిబ్బంది ఈ నెల పదో తేదీన విచారించడంతో అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయని డీసీపీ వర్మ ట్విటర్‌లో తెలిపారు. ఈ క్యాబ్‌లలో రాకపోకలు సాగించే మహిళలకు తగినంత భద్రత లేదనే విషయం బయటపడిందన్నారు. భద్రతా ప్రమాణాలు కూడా అంతంతమాత్రమేనని తేలిందని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. అదే రోజు అమెరికాలో ఉంటున్న నిధి షా అనే మరో బాధితురాలు నవంబర్‌లో తాను భారత్‌కు వ చ్చానని, అప్పుడు తనపట్లకూడా నిందితుడు అసభ్యంగా వ్యవహరించాడని ట్విటర్‌లో స్పందించింది.
 

Advertisement
Advertisement