అనధికార కాలనీలను క్రమబద్ధీకరిస్తాం

1 Apr, 2015 02:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని అనధికార కాలనీలను తమ ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. దీని కోసం కాలనీల సరిహ ద్దులను నిర్ధారించడం, రిజిస్ట్రేషన్ చేయడం వంటి ప్రకియలను త్వరలో చేపడతామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు లేఅవుట్లను తయారుచేసి అనధికార కాలనీల క్రమబద్ధీకరణపై తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన కోరారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణ ప్రక్రియ చాలా ఏళ్లుగా నానుతూ వస్తోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం నడుంబిగించిందని చెప్పారు. కాగా, అనధికార కాలనీల క్రమబద్ధీకరణ ప్రక్రియలో మూడు దశలు ఉంటుందని తెలిపారు.
 
 అవి సరిహద్దు నిర్ధారణ, లేఅవుట్ తయారీ, రిజిస్ట్రేషన్ అని చెప్పారు. వీటిలో సరిహద్దు నిర్ధారణ, రిజిస్ట్రేషన్ ఢిల్లీ ప్రభుత్వం చేస్తుందని, లే అవుట్ తయారీ మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ల చేతిలో ఉంటుందన్నారు. తమ చేతుల్లో ఉన్న రెండు ప్రక్రియలను ఒక దాని తర్వాత ఒకటి చేపడుతూ నగరంలోని అనధికార కాలనీల క్రమమబద్ధీకరణ ప్రారంభిస్తామని చెప్పారు. రెవెన్యూ విభాగం అనధికార కాలనీల సరిహద్దులను నిర్ధారించి మున్సిపల్ కార్పొరేషన్‌కు పంపుతుందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు కాలనీ లేఅవుట్ తయారుచేసిన వెంటనే తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ జరుపుతుందని చెప్పారు. అనంతరం దానిని క్రమబద్ధీకరించిన కాలనీగా డీడీఏ ప్రకటిస్తుందని సిసోడియా వివరించారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు