చిక్కుల్లో చిన్నమ్మ

3 Feb, 2017 07:44 IST|Sakshi
చిక్కుల్లో చిన్నమ్మ

► మళ్లీ మెడకు చిక్కుకున్న విదేశీ మారక ద్రవ్యం కేసు
► కింది కోర్టు తీర్పును  రద్దు చేసిన మదురై హైకోర్టు
► శశికళ, దినకరన్ లపై  ఈడీ కేసులకు సమర్థన


సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. విదేశీ మారక ద్రవ్యం మోసం కేసు నుంచి శశికళ,  ఆమె సమీప బంధువు దినకరన్ లకు విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును మదురై హైకోర్టు రద్దు చేసింది. ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పెట్టిన అన్ని కేసులను చట్టపరంగా ఎదుర్కొనక తప్పదని న్యాయమూర్తి జి.చొక్కలింగం బుధవారం తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వాటాదారుగా ఉన్న భరణి బీచ్‌ రిసార్ట్స్‌ సంస్థకు ఎన్ ఆర్‌ఐ సుశీలా రామస్వామి అనే వ్యక్తి నుంచి  పరోక్షంగా రూ.3 కోట్లు అప్పు అందింది. ఈ మొత్తంలో రూ.2.2 కోట్లు కొడనాడు ఎస్టేట్స్‌లో వాటాగా పెట్టుబడి పెట్టారు. రిజర్వుబ్యాంకు అనుమతి లేకుండా విదేశీ మారక ద్రవ్యం చేతులు మార్చినట్లుగా శశికళ, దినకరన్, జేజే టీవీ తదితరులపై 1996లో ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ)కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తమను తప్పించాల్సిందిగా కోరుతూ చెన్నై ఆర్థిక నేరాల న్యాయస్థానంలో శశికళ పిటిషన్  దాఖలు చేశారు.

ఈ పిటిషన్  విచారించిన కోర్టు 2015లో తీర్పు చెప్పింది. మూడు కేసుల నుంచి శశికళకు విముక్తి కల్పించేందుకు నిరాకరించి, ఒక కేసు నుంచి తప్పించేందుకు అంగీకరించింది. అలాగే రెండు కేసుల నుంచి దినకరన్ కు విముక్తి కల్పించింది. విముక్తి కల్పించేందుకు నిరాకరించిన మూడు కేసులపై శశికళ మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసింది. శశికళ, దినకరన్ లపై కేసులు ఎత్తివేయడం సరికాదంటూ ఈడీ కూడా హైకోర్టులో అప్పీలు పిటిషన్  దాఖలు చేసింది.  శశికళ, దినకరన్ లకు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో ఈ విధంగా పేర్కొన్నారు. శశికళ స్నేహితురాలు చిత్ర అనే వ్యక్తికి ఎన్ ఆర్‌ఐ సుశీలా రామస్వామి రూ.3 కోట్లను అప్పుగా ఇచ్చారు. అప్పుగా తీసుకున్న ఆ మొత్తాన్ని శశికళ ఖాతాకు చిత్ర బదిలీ చేశారు. 

ఇందుకోసం 25 చెక్కులను చిత్ర ఇచ్చారు. తలా రూ.22 లక్షల విలువైన రెండు చెక్కులు శశికళ బంధువులు సుధాకరన్, ఇళవరసి పేర్లతో జారీ కాగా, మిగిలిన చెక్కులపై పేర్లు లేకుండానే ఇచ్చారు. భరణి బీచ్‌ రిసార్ట్స్‌ సంస్థ పేరుతో పాయస్‌గార్డెన్  ఇంటి ఫోన్  ద్వారా మలేషియాలోని సుశీలా రామస్వామి ఇంటికి అనేక సార్లు మాట్లాడి ఉన్నారు. ఈ లావాదేవీల్లో నడిచిన గోల్‌మాల్‌ను కిందికోర్టు న్యాయమూర్తి గుర్తించలేదు. కాబట్టి ఒక కేసు నుంచి శశికళకు, రెండు కేసుల నుంచి దినకరన్ కు విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈడీ తన అప్పీలు పిటిషన్ లో హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ శశికళ, ఈడీ తరపున దాఖలైన అప్పీలు పిటిషన్లపై వాదోపవాదాలు ముగిసిన నేపథ్యంలో గతంలో న్యాయమూర్తి తేదీని ప్రకటించకుండా తీర్పును వాయిదా వేశారు. కాగా, న్యాయమూర్తి జీ.చొక్కలింగం బుధవారం సాయంత్రం మదురై హైకోర్టులో తీర్పు చెప్పారు.

రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ మారకద్రవ్యం చేతులు మారిందని, శశికళ భాగస్వామిగా ఉన్న సంస్థకు ఈ సొమ్ము చేరినట్లుగా న్యాయస్థానం విశ్వసిస్తోందని న్యాయమూర్తి అన్నారు. సంస్థకు తాను భాగస్వామిగా మాత్రమే ఉన్నానని, కార్యకలాపాలతో సంబంధం లేదనే వాదన అంగీకరించేది లేదని, భాగస్వామిగా అన్ని కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నట్లుగా చూపుతూ అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. సంస్థాపరమైన లావాదేవీల్లో శశికళ సంతకాలు కూడా చేసి ఉన్నారని తెలిపారు. కాబట్టి  చట్టపరమైన చర్యలను ఎదుర్కొనక తప్పదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

కింది కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి సమర్థిస్తూ, మూడు కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ శశికళ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ ను కొట్టివేశారు. అలాగే, శశికళ, దినకరన్ లకు విముక్తి ప్రసాదిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక నేరాల కింద వారిపై చర్యలు సమంజసం కాబట్టి విముక్తి ప్రసాదిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శశికళ, దినకరన్ లు ఈడీ పెట్టిన కేసుల విచారణను ఎదుర్కొనక తప్పదని న్యాయమూర్తి చొక్కలింగం స్పష్టం చేశారు.