అర్ధనగ్నంగా శివుడి కోసం తపస్సు

12 Aug, 2016 21:18 IST|Sakshi
అర్ధనగ్నంగా శివుడి కోసం తపస్సు

 టీనగర్: శివుడి ప్రత్యక్షం కోసం అరంతాంగి సమీపంలో ఓ వృద్ధుడు అర్ధనగ్నంగా తపస్సు చేయడం సంచలనం కలిగించింది. పుదుక్కోట్టై జల్లా అరంతాంగి సమీపంలోని వడుకాడు గ్రామంలో మేలపట్టు పంచాయతీ అధ్యక్షుడు కన్నన్ అరటి తోపు ఉంది. దీనికి సమీపంలోని శ్మశానంలో ఓ వృద్ధుడు అర్ధనగ్నంగా 10 అడుగుల లోతు గుంతలో తొమ్మిది రోజులుగా తపస్సు చేస్తున్నట్లు సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూడగా గుంతలో ఓ వృద్ధుడు తూర్పు దిక్కుగా అర్ధనగ్నంగా కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఈ గుంత పైభాగంలో కొబ్బరి ఆకులతో గుడారం నిర్మించబడింది.
 
  అరంతాంగి ఇన్‌స్పెక్టర్ బాలమురుగన్, హెడ్ కానిస్టేబుల్ శరవణన్ అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. విచారణలో తపస్సు చేస్తున్న వ్యక్తి అరంతాంగి చిన్న అన్నానగర్‌కు చెందిన ముత్తుకృష్ణన్(60)అని, గత ఆడి అమావాస్య నుంచి గుంతలో అర్ధనగ్నంగా తపస్సు చేస్తున్నట్లు తెలిసింది. అమావాస్య నుంచి తపస్సు చేసి 12వ రోజున శివుడిని నేరుగా దర్శించేందుకు తపస్సు చేస్తున్నట్లు సమాచారం. తొమ్మిది రోజులుగా ఉదయం, సాయంత్రం ఉడికించిన గుగ్గిళ్లు మాత్రం అతను ఆరగిస్తున్నట్లు తెలిసింది. 12 రోజుల్లో శివుడు ప్రత్యక్షం కాకుంటే దీక్షను 42 రోజులకు కొనసాగించనున్నట్లు తెలిసింది. పోలీసులు అతన్ని చూసి తపోభంగం కలిగించకుండా వెనక్కి వచ్చేశారు.
 

మరిన్ని వార్తలు