కుమారుడి నరబలికి యత్నం

6 Jun, 2016 03:28 IST|Sakshi
కుమారుడి నరబలికి యత్నం

తండ్రి అరెస్ట్
టీనగర్: కొడుకును నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించిన తండ్రిని ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఆరూర్ సమీపంలోని ఆలయంలో చోటుచేసుకుంది.  ధర్మపురి జిల్లా ఆరూర్ సమీపానగల టి.పుదూరు గాంధీనగర్‌కు చెందిన సుబ్రమణి. ఇతని కుమారుడు పరశురామన్ (35) మినీ టెంపో డ్రైవర్. ఇతని కుమారుడు సంజీవ్ (5). వీరు ముగ్గురూ శనివారం రాత్రి గోపినాథంపట్టి క్రాస్‌రోడ్డులోగల మునియప్పన్ ఆలయానికి మినీ టెంపోలో వచ్చారు.

ఆ సమయంలో పరశురామన్ ఆలయం సమీపంలో టెంపో నిలిపి మద్యం తాగాడు. సుబ్రమణి టెంపోలో ఉన్నాడు. ఈ దశలో పరశురామన్‌కు మత్తెక్కడంతో ఐదేళ్ల కుమారుడు సంజీవ్ తలను పట్టుకుని చేతిలో ఉన్న కత్తితో నరబలి ఇస్తున్నట్లుగా నిలుచున్నాడు. దీంతో సంజీవ్ బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు ప్రజలు అక్కడికి చేరుకున్నారు. టెంపోలో ఉన్న సుబ్రమణి దిగి వచ్చాడు. ప్రజలు పరశురామన్‌పై దాడి చేశారు. కొందరు దీనిగురించి ఎ.పల్లిపట్టు పోలీసులకు సమాచారం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సుబ్రమణి, పరశురామన్, బాలుణ్ని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

పోలీసులు సుబ్రమణి వద్ద విచారణ జరిపారు. 2008లో పరశురామన్‌కు సుజాత అనే యువతితో వివాహం అయింది. ఇలాఉండగా కొన్ని నెలలుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. నాలుగు నెలల క్రితం ఏర్పడిన గొడవల్లో సుజాత పరశురామన్ నుంచి విడిపోయి బెంగళూరులో గల పినతల్లి ఇంటికి సంజీవ్‌తోపాటు వెళ్లింది. దీంతో పరశురామన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పరశురామన్ భార్య, కుమారుడిని చూసేందుకు బెంగళూరు వెళ్లాడు. అక్కడ భార్యను తన వెంట రమ్మని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో పరశురామన్ ఆగ్రహించి కుమారుడిని తన వెంట తీసుకెళుతున్నానని తెలిపి సంజీవ్‌ను వెంట తీసుకువచ్చాడు. ఇలా ఉండగా భార్య ఎడబాటుతో అధికంగా మద్యం తాగి పరుశురామన్ స్వామి సన్నిధిలో నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో చిన్నారి సంజీవ్‌ను అతని తాత సుబ్రమణితో పంపివేశారు. పోలీసులు పరశురామన్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు