తమిళనాడులో 'యముడు' భయం ..

10 Dec, 2015 08:11 IST|Sakshi
తమిళనాడులో 'యముడు' భయం ..

చెన్నై: వరద బీభత్సంతో అతలాకుతలమైన తమిళనాడును కొత్తగా యమధర్మరాజు భయపెడుతున్నాడు. తన వాహనం దున్నపోతుపై వచ్చి, ఇంటి యజమానుల ప్రాణాలను హరిస్తాడని ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని స్థానిక పంచాంగకర్తలు కూడా నిర్ధారించారు. దీంతో జనం భయం మరింత రెట్టింపైంది.

ప్రధానంగా సేలం జిల్లా అంతటా యముడు వస్తున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో మాంగల్యం కాపాడుకునేందుకు జిల్లాలోని మహిళలు బుధవారం తెల్లవారుజామునే నిద్ర లేచి, తలస్నానం ఆచరించి, ఇంటిముందు ముగ్గులు వేసి  దీపాలు వెలిగించారు. తమ తమ కుటుంబసభ్యులతో కలసి మహిళలు ఆంజనేయస్వామి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే బుధవారం రాత్రి దాకా యముడి జాడ ఎక్కడ కనిపించడపోవడంతో  జిల్లా వాసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

అప్పట్లో వినాయకుడు పాలు తాగుతున్నాడని దేశవ్యాప్తంగా, మొన్నామధ్య ఇంటి పెద్దకొడుకుకు గండం ఉంటుందని తెలంగాణలో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో నేటి యముడి భయం కూడా అలాంటిదే. గుర్తుతెలియని వ్యక్తులు చేసే అసత్య ప్రచారాలను నమ్మి భయాందోళనలు గురి కావదంటూ ప్రజలకు పోలీసులు సూచించారు.

మరిన్ని వార్తలు