మూడో విడత ప్రచారంపై దృష్టి

16 Apr, 2014 22:33 IST|Sakshi

 సాక్షి, ముంబై: రాష్ట్రంలో రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు తెరపడడంతో ఇక మూడో దశ ఎన్నికల ప్రచారంపై ఆయా పార్టీలు దృష్టి సారించాయి. నగరంలో ముఖ్య నేతలతో రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 20న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ, 21న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభ ఉందని ఆయా పార్టీల నేతలు తెలిపారు. కాగా, మొన్నటివరకు నగరంతో పాటు శివారు ప్రాంతంలో అడపాదడపా జరిగిన ప్రచారాలు ఇక నుంచి మరింత జోరుగా సాగనున్నాయి.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనవల్ల బిజీగా ఉన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇప్పుడు మూడో దశ ఎన్నికలపై దృష్టి సారించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్‌కు మద్ధతుగా ప్రచారం నిర్వహించనున్నారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గిరణ్ గావ్ (మిల్లులున్న) ప్రాంతంలో దక్షిణ ముంబై మహా కూటమి అభ్యర్థి అరవింద్ సావంత్‌కు మద్ధతుగా ప్రచారం నిర్వహించనున్నారు.


 మరోవైపు నగరంలో బడా నాయకులు ప్రచారాలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. 2009లో నగరం, శివారు ప్రాంతాల్లోని మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్, ఎన్సీపీలకు ఈసారి కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడుతోంది.
 అదే శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమికి మూడు స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చవాన్, మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ వారం రోజుల్లో ఎన్నికల వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకే ఏకదాటిని ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న 19 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు