గాంధీ గురించి తెలియని ఉపాధ్యాయులు

20 Sep, 2014 02:34 IST|Sakshi
గాంధీ గురించి తెలియని ఉపాధ్యాయులు
  • గాంధీ గురించి తెలియని ఉపాధ్యాయులు
  •  మహత్ముడి గురించి మంత్రి అడిగిన ప్రశ్నలకు బిక్కమొహాలు
  •  ఆప్షన్ ఇస్తూ వివేకానందుడి గురించి అడిగినా సమాధానం శూన్యం
  •  త్వరలో 16 వేల మంది టీచర్ల నియామకం
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఏదో పని మీద అయ్యవార్లు మంత్రి వద్దకు వచ్చారు. పార్టీ ఆఫీసులోనే కనుక సులభంగా పనులైపోతాయని ఉత్సాహ పడ్డారు. తీరా మంత్రి నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురవడంతో సమాధానాలు చెప్పలేక బిక్కమొహాలేశారు. పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ శుక్రవారం కేపీసీసీ కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యకర్తల సమస్యలను తెలుసుకోగోరారు.

    ఇదే సందర్భంలో కొందరు ఉపాధ్యాయులు తమ సమస్యలను ఏకరువు పెట్టడానికి వచ్చారు. వారు సీఎల్ పెట్టి వచ్చారా లేక స్కూళ్లకు డుమ్మా కొట్టారా...అని మంత్రి వాకబు చేశారు. సీఎల్ పెట్టి వచ్చామని చెప్పడంతో, పిల్లలకు పాఠాలు ఎలా చెబుతున్నారంటూ ఆరా తీశారు. వెంటనే...గాంధీజీ గురించి ఏం పుస్తకాలు చదివారు, ఆయన ఎక్కడ, ఎప్పుడు పుట్టారు అని ప్రశ్నించారు.

    ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయిన ఉపాధ్యాయులు నీళ్లు నమిలారు. పోనీ..వివేకానందుడు ఎప్పుడు జన్మించారో చెప్పండంటూ ‘ఆప్షన్’ ఇచ్చారు. దానికీ సమాధానం లేదు. దీంతో అసహనానికి గురైన మంత్రి...మీరు పిల్లలకు ఏం పాఠాలు చెబుతారు, ఎవరిని ఆదర్శంగా తీసుకోమంటారు అంటూ నిష్టూరమాడుతూ, బయటకు నడవాల్సిందిగా ద్వారం వైపు చూపించారు.
     
    16 వేల మంది టీచర్ల నియామకం

    ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరతను నివారించడానికి వచ్చే నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది ఉపాధ్యాయులను నియమిస్తామని మంత్రి తెలిపారు. కేపీసీసీ కార్యాలయంలో కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే 11,400 మంది ఉపాధ్యాయుల నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి లభించిందని వెల్లడించారు. మిగిలిన పోస్టులకు కూడా త్వరంలోనే ఆమోదం లభిస్తుందన్నారు.  కొరత ఎదురు కాకుండా ఏటా అయిదు వేల మంది ఉపాధ్యాయులను నియమించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారని తెలిపారు.
     

మరిన్ని వార్తలు