Bengaluru: చెత్త కుప్పలో 30 లక్షల డాలర్లు 

8 Nov, 2023 03:55 IST|Sakshi

చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన నగదు

బెంగళూరులో ఘటన  

బనశంకరి: రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్‌ డాలర్ల కట్టలున్నాయి.   భారతీయ కరెన్సీలోకి మారిస్తే వాటి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుంది. ఈ నెల 3వ తేదీన బెంగళూరు నాగవార రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాల పక్కన ఎస్‌కే సాల్మన్‌ చెత్త సేకరిస్తుండగా ఓ బ్యాగు దొరికింది. దానిపై యునైటెడ్‌ నేషన్స్‌ అనే ముద్ర ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందిన ఎస్‌కే సాల్మన్‌ బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంచిని అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లి తెరిచి చూడగా 23 బండిళ్ల డాలర్లు కనిపించాయి.

ఏం చేయాలో తెలియక గుజరీ వ్యాపారికి ఈ విషయం చెప్పాడు. తాను వేరే ఊరికి వెళ్లానని, బెంగళూరుకు వచ్చేవరకు మీ వద్ద పెట్టుకోవాలని సూచించాడు. కానీ భయపడ్డ సాల్మన్‌.. రెండురోజుల తర్వాత స్వరాజ్‌ ఇండియా సామాజిక కార్యకర్త ఆర్‌.కలీముల్లాను కలిసి విషయం చెప్పాడు. కలీముల్లా ఈ సంగతిని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానందకు తెలిపారు. ఆయన సూచనతో సాల్మన్‌ను, నగదును తీసుకుని కమిషనర్‌ ఆఫీసుకు వెళ్లారు.

మరోవైపు నగదు దొరికిన ప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ డాలర్లు నకిలీవని భావిస్తున్నారు. తనిఖీ కోసం వాటిని నగరంలోని రిజర్వు బ్యాంకుకు పంపినట్టు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు ఐక్యరాజ్యసమితి ఆర్థిక నేరాల విభాగానికి చెందినదని పోలీసులు చెప్పారు. బ్యాగులో విషపూరితమైన రసాయనాలున్నందున.. తెరిచేటప్పుడు జాగ్రత్త అని ఒక పెద్ద లెటర్‌ కూడా అందులో ఉండటం విశేషం. అంత డబ్బును చూశాక తాను ఉద్వేగంతో ఒక రోజంతా నిద్రపోలేదని సాల్మన్‌ చెప్పాడు.    

మరిన్ని వార్తలు