గుట్టుగా లింగ నిర్ధారణలు

25 Aug, 2016 01:06 IST|Sakshi
గుట్టుగా లింగ నిర్ధారణలు

వేలూరు: తిరువణ్ణామలైలో పది సంవత్సరాలుగా గుట్టుగా మహిళలకు అబార్షన్ చేస్తున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ బండారం బైటపడింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తిరువణ్ణామలై అవుల్‌పురం వీధిలోని ఓ ఇంట్లో మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నట్లు ఆరోగ్యశాఖా అధికారులకు సమాచారం అందింది. దీంతో వైద్య సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ గురునాథన్, అసిస్టెంట్ కమిషనర్ నరసింహన్, సూపరింటెండెంట్ కమలకన్నన్‌తో కూడిన పది మంది బృందం తిరువణ్ణామలైకి వచ్చారు.
 
  వీరు తిరువణ్ణామలైలోని ఆరోగ్య జిల్లా జాయింట్ డెరైక్టర్, పోలీసులతో సమీక్షించి అవుల్‌పురంలోని ఇంట్లో అకస్మిక తనిఖీ చేపట్టారు. అధికారుల తనిఖీ సమయంలో అక్కడున్న కొంతమంది మహిళలను విచారించగా అబార్షన్ కోసం వచ్చినట్లు తెలిసింది.  వీరిలో కొంతమంది పరీక్షలు వికటించి బాధపడుతుండడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఇంటిలో పరిశీలించగా అబార్షన్ చేసేందుకు అవసరమైన మాత్రలు, స్కానింగ్ మిషన్‌లు, ఇంజెక్షన్‌లు ఉన్నట్లు గుర్తించారు.
 
  మరోగదిలో లింగనిర్ధారణ చేయడానికి అవసరమైన మిషన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై తిలగవతి వద్ద విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా అధికారుల విచారణలో తిలగవతి పదేళ్ల క్రితం ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసినట్లు తెలిసింది. లింగ నిర్ధారణతో పాటు అబార్షన్ చేయడానికి ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు తేలింది. ఈ విధంగా ఇప్పటివరకూ వేలల్లో అబార్షన్‌లు చేసి, పలు లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఆమెను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు