నేడు గొల్లపూడి అంత్యక్రియలు

15 Dec, 2019 03:54 IST|Sakshi

చిరంజీవి, యార్లగడ్డ సహా ప్రముఖుల నివాళి

తమిళ సినిమా: ప్రఖ్యాత సినీ నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు భౌతిక కాయానికి ఆదివారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, భానుచందర్, నటీమణులు సుహాసిని, ప్రభ, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలు సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఆయన మనవళ్లు, మనవరాళ్లు విదేశాల నుంచి శనివారం చెన్నై చేరుకోగా.. ఓ ప్రైవేటు ఆస్పత్రి మార్చురీలో ఉన్న భౌతిక కాయాన్ని టి.నగర్‌లోని నివాసానికి తీసుకొచ్చి ఆప్తులు, కుటుంబీకుల సందర్శనార్థం ఉంచారు.

ఆయన వద్ద శిక్షణ పొందా: చిరంజీవి
మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. గొల్లపూడి తనకు మంచి మిత్రుడని, అంతకంటే గొప్ప ఆప్తుడని చెప్పారు. ఆయనతో 1989లో పరిచయం ఏర్పడిందని, తాను ఆయన వద్ద కొన్ని వారాల పాటు శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. గొల్లపూడి తాను నటించిన ఐ లవ్‌ యూ చిత్రానికి మాటలు రాశారని, ఆ తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి తమ అనుబంధం కొనసాగుతూ వచ్చిందన్నారు.

ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరన్నారు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ గొల్లపూడి గొప్ప నటుడు, రచయిత, వక్త అని కొనియాడారు. తనకు ఆయనతో చిరకాల అనుబంధం ఉందన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీర్చలేనిదని పేర్కొన్నారు. ఇదిలావుండగా.. గొల్లపూడి అంత్యక్రియలను ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో టి.నగర్‌లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు