జీఎస్టీలో 5 అంశాలపై అంగీకారం

1 Oct, 2016 03:25 IST|Sakshi

మరిన్ని రాష్ట్రాలకు ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు

 

 న్యూఢిల్లీ: జీఎస్టీలో సేవా పన్ను అంశంపై కేంద్రం, రాష్ట్రాలు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. జీఎస్టీ కౌన్సిల్ రెండో దఫా సమావేశం శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తొలి సమావేశంలో సేవా పన్నుపై తీసుకున్న నిర్ణయంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే, చట్టంలోని ఐదు ఉప విభాగాలపై మాత్రం అంగీకారానికి వచ్చాయి. రిజిస్ట్రేషన్, చెల్లింపులు, రిటర్నులు, రిఫండ్స్, ఇన్‌వాయిస్ అంశాలపై  నిబంధన లు ఖరారయ్యాయి.

జీఎస్టీలో మినహాయింపులపైనా అంగీకారం కుదిరింది. ప్రస్తుతం కేంద్రం ఈశాన్య రాష్ట్రాలు సహా మొత్తం 11 రాష్ట్రాలకు ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు కల్పిస్తోంది. ఇదే మినహాయింపు మరిన్ని రాష్ట్రాలకు వర్తించనుంది. జీఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, ఇతర పన్నులను కలిపేసి వసూలు చేయాలని జీఎస్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇలా వసూలు చేసిన పన్నును తిరిగి వార్షిక బడ్జెట్‌లో మినహాయింపు కేటగిరీ కింద రాష్ట్రాలకు కేంద్రం తిరిగి చెల్లిస్తుంది.

గతవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సర్వీస్ ట్యాక్స్‌పై తీసుకున్న నిర్ణయంపై విభేదాలు వ్యక్తమయాయయి. కేంద్రం 11 లక్షల సర్వీస్ ట్యాక్స్ రిటర్నులను క్రోడీకరించే విషయమై తీసుకున్న నిర్ణయంతో రెండు రాష్ట్రాలు విభేదించాయి. దీనిపైనే ఎక్కువ సేపు చర్చజరిగింది. వాస్తవానికి ఈ అంశంపై ఎక్కువ రాష్ట్రాలు సానుకూలంగా ఉండడంతో ఓటింగ్ పెట్టాలనే డిమాండ్ వచ్చింది. అయితే, ఏకాభిప్రాయంతోనే నిర్ణయం జరగాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశించడంతో నిర్ణయం వాయిదా పడింది. చర్చ అసంపూర్ణంగా మిగిలిందని, దీనిపై తదుపరి అక్టోబర్ 18 నాటి సమావేశంలో చర్చిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు.

మరిన్ని వార్తలు