అంబేద్కర్‌కు ఘన నివాళి

6 Dec, 2014 22:13 IST|Sakshi

జనసంద్రంగా మారిన చైత్యభూమి
సదుపాయాలు కల్పించిన బీఎంసీ
అన్నదానం చేసిన స్వచ్ఛంద సంస్థలు

 
సాక్షి, ముంబై: శివాజీపార్క్‌లోని చైత్యభూమి పరిసరాలు జనసంద్రంగా మారాయి. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని శనివారం దాదర్ ప్రాంతమంతా ఆయన అభిమానులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది జనం శుక్రవారం అర్ధరాత్రి నుంచి చైత్యభూమి వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం ప్రారంభించారు. శనివారం ఉదయం  గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర  ఫడ్నవిస్, మేయర్ స్నేహల్ అంబేకర్, బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ నాయకుడు ప్రకాష్ ఆంబేకర్, ఆర్పీఐ నాయకుడు రాందాస్ ఆఠవలే, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన కొందరు కొత్త మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ చైత్యభూమికి పక్కనే ఉన్న ఇందు మిల్లు స్థలంలో 2015 ఏప్రిల్ 14న అంబేద్కర్ స్మారకానికి భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడతాయని చెప్పారు. మహాపరినిర్వాణ్ సందర్భంగా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అన్ని సౌకర్యాలు కల్పించింది.

శివాజీపార్క్ మైదానంలో లక్ష చదరపు టడుగుల విస్తీర్ణంలో నేలపై కార్పెట్లు పరిచారు. మూడు రోజుల ముందు నుంచి ఇక్కడ అభిమానుల సందడి మొదలైంది. వారికి బస మొదలుకుని స్నానాల గదులు, తాగునీరు, సంచార మరుగు దొడ్లు, కుళాయిలు ఇతర సదుపాయాలు కల్పించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లు సిద్ధంగా ఉంచింది. తప్పిపోయిన వారి వివరాలు అందించేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బలగాలను మోహరించారు. వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అవసరమైతే అస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు.

చైత్యభూమికి సమీపంలో ఉన్న ఇందూ మిల్లు ఖాళీ స్థలంలో కూడా సౌకర్యాలు కల్పించారు. లక్షలాదిగా తరలివచ్చిన అంబేద్కర్ అభిమానులు ఇబ్బందులు పడకుండా శివాజీపార్క్ పరిసరాల్లో వాహనాల రాకపోకల్లో మార్పులు చేశారు. చైత్యభూమి ఇరువైపుల క్యూలో నిలబడేందుకు తాత్కాలిక బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ఇటు సెంచూరి బజార్, అటు మాహిం దిశగా ఫుట్‌పాత్‌లపై రెండు కి.మీ. మేర క్యూ లైను ఏర్పాటుచేశారు. శివాజీపార్క్ మైదానంలో అంబేద్కర్ ఆనుయాయులకు అనేక సేవా సంస్థలు అల్పాహారాలు, తాగు నీరు, భోజనం తదితరా తినుబండరాలు పంపిణీ చేశాయి.

టీవీవీ ఆధ్వర్యంలో అన్నదానం

అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చైత్యభూమి వద్ద తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ), తెలుగు బహుజన మహాసభ (టీబీఎం) ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాన్ని టీబీఎం అధ్యక్షుడు నాగ్‌సేన్ మాల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీవీవీ కన్వీనర్ కె. నర్సింహ గౌడ్, భీవరత్న మాల, రాంతంగారే మాదిగ, తలారి నవీన్, చాందన్ అహ్మద్, సంపత్ కుమార్ మాదిగ, మూల్‌నివాసి మాల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు