మేయర్ అభ్యర్థిత్వంపై టీడీపీలో రణం

21 Sep, 2016 06:02 IST|Sakshi
మేయర్ అభ్యర్థిత్వంపై టీడీపీలో రణం

► సామాజిక వర్గాల వారీగా విడిపోయి నేతల సమావేశాలు
► ఆర్యవైశ్య, కాపు నేతల్లో ఆశలు
► పోటీలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త!
 
గుంటూరు : నగరపాలక సంస్థ ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ టీడీపీలో వర్గపోరు తీవ్రమవుతోంది. ప్రధానంగా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వం కోసం సామాజిక వర్గాల వారీగా విడిపోయి మరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ మేయర్ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు పేరు ప్రచారంలో ఉంది.
 
ఈసారి తమకే మేయర్ అభ్యర్థిత్వం కేటాయించాలంటూ ఆర్యవైశ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మద్ధాళి గిరిధర్ ఇప్పటికే తనవంతు ప్రయత్నాలను మమ్మురం చేశారు. ఇప్పటికే అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవిని ఆర్యవైశ్యులకు కేటాయించాల్సి ఉండగా వేరే వారికి ఇచ్చారని, మేయర్ అభ్యర్థిత్వమైనా ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు సైతం మేయర్ స్థానం తమకే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో ఎవరికివారు సామాజిక వర్గాల వారీగా విడిపోయి సమావేశాలు నిర్వహించుకుంటూ తమ బలాన్ని అధిష్టానం ముందు ప్రదర్శించేందుకు సమాయత్తమవుతున్నారు.
 
ఎంపీ ఆశీస్సులతో తెరపైకి పారిశ్రామికవేత్త...
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆశీస్సులతో పారిశ్రామికవేత్త తెర మీదకు రావడం వీరందరినీ కలవరానికి గురిచేస్తోంది. విదేశాల్లో సైతం ఆయనకు వ్యాపారాలు ఉండటం, డబ్బు అధికంగా పెడతాడనే కారణంతో ఆయన పేరును తెరపైకి తెచ్చారు. పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం కష్టపడి పనిచేసిన వారిని వదిలేసి డబ్బు పెడతారనే సాకుతో కొత్త వ్యక్తులకు మేయర్ పదవి కట్టబెడితే ఊరుకునేది లేదంటూ టీడీపీ నాయకులు ఇప్పటికే పలు సమావేశాల్లో టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.
 
మేయర్ అభ్యర్థిత్వంపై తమ మాటే చెల్లుబాటు కావాలంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పట్టుబడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తనకు స్వేచ్ఛనిస్తే 50కి పైగా స్థానాలు గెలిపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు.
 
రావెల అభ్యర్థికి డిప్యూటీ!
 గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను మంత్రి రావెల కిశోర్‌బాబుకు అప్పగించినట్లు సమాచారం. నగరపాలక సంస్థలో నూతనంగా విలీనమైన పది గ్రామాలను ఐదు డివిజన్లుగా విభజించారు. ఈ గ్రామాలు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. దీంతో మంత్రి రావెల తన నియోజకవర్గం నుంచి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని నియమించనున్నట్లు తెలియడంతో టీడీపీలో వర్గపోరు మరింత తీవ్రం కానుంది. మార్కెట్ యార్డు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కమ్మ, కాపు సామాజిక వర్గాల నేతలకు ఇవ్వడంతో మేయర్ పదవి తమకు ఇవ్వాల్సిందేనంటూ ఆర్యవైశ్యులు పట్టుబడుతున్నారు. అన్ని పదవులూ ఆ సామాజిక వర్గానికేనా అంటూ బహిరంగంగానే నిలదీస్తున్నారు.
 
నేతల తీరుపై మింగుడుపడని అధిష్టానం

మరోవైపు టీడీపీలోని డివిజన్ స్థాయి నాయకుల ఆగడాలపై ఇప్పటికే ఆయా డివిజన్‌లలోని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. భవన నిర్మాణాల నుంచి పింఛన్ల వరకు వారికి ముడుపులు చెల్లించాల్సి వ స్తోంది. దీనిపై టీడీపీ ప్రజాప్రతినిధులు ఒకింత కలవరానికి గురవుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఎవరికి తోచిన విధంగా వారు గ్రూపులుగా విడిపోగా, డివిజన్లలో నాయకుల అవినీతి టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని టీడీపీకే చెందిన సీనియర్ మాజీ కార్పొరేటర్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.

మరిన్ని వార్తలు