నిర్భయ కేసులో దోషుల తరఫు న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం

9 Nov, 2013 00:29 IST|Sakshi

 న్యూఢిల్లీ : నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషుల తరఫు న్యాయవాది కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరగడం బాధాకరమైన విషయమని శుక్రవారం ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది డిసెంబర్ 16 వ తేదీన ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ బాధితురాలు మృతిచెందింది. కాగా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ఆరుగురిలో ఒకడు తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా, మరొకడు మైనర్ కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు అతడికి మూడేళ్ల శిక్ష విధించింది. కాగా మిగిలిన నలుగురికి సెప్టెంబర్ 13న ట్రయల్ కోర్డు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. దాన్ని హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హంతకుల్లో ఇద్దరి తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ కొంతకాలంగా హైకోర్టులో వాదనలకు హాజరు కావడంలేదు. దాంతో శుక్రవారం హైకోర్టు బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభా రాణి అతడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  ‘ కోర్టు నుంచి వారు పారిపోతున్నారు..’ అంటూ ఆక్షేపించారు. ‘ఇలా చాలా ఇబ్బందికర పరిస్థితి. మీ ప్రవర్తనపై మేం చాలా చింతిస్తున్నాం..’ అంటూ వారు శర్మను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘ పరిస్థితుల నుంచి పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఎంతకాలం మీరు తప్పించుకు తిరుగుతారు? ఎంత త్వరగా మీరు మీ వాదనలతో ముందుకు రాగలిగితే అంత మంచిది..’ అని సూచించారు. లేదంటూ కోర్టుకు సహకరించేందుకు తామే న్యాయవాదిని నియమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ‘మీరు ఉద్దేశపూర్వకంగానే వాదనలకు హాజరు కావడంలేదని మేం భావిస్తున్నాం. మీరు హైకోర్టుకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ వదిలి బయటకు ఎలా వెళ్లారు? మీరు చేసింది ముమ్మాటికీ కోర్టును ఇబ్బంది పెట్టడమే’నంటూ శర్మనుద్దేశించి జస్టిస్ ఖేత్రపాల్ అన్నారు. తాను ముంబై కోర్టులో జస్టిస్ చంద్రచూడ్ ముందు ఒక కేసు విషయమై వాదనలు వినిపించడానికి అక్టోబర్ 7వ తేదీన వెళ్లానని, నవంబర్ 12 వ తేదీన ఢిల్లీ కోర్టులో వాదనలకు హాజరు కాగలనని తన తరఫు న్యాయవాదితో శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. దీనిపై ప్రత్యేక పబ్లిక్‌ప్రాసిక్యూటర్ దయాన్ కృష్ణన్ మాట్లాడుతూ జస్టిస్ చంద్రచూడ్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటికే పదవీ బాధ్యతలు స్వీకరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చా రు. అలాగే ఈ నెల 11న నలుగురు దోషులను కోర్టులో ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించింది.
 
 దోషుల తరఫున వారి కుటుంబసభ్యులెవరూ కోర్టుకు హాజరు కావడంలేదని కోర్టు గుర్తించింది. దోషుల్లో వినయ్, అక్షయ్ తరఫున వచ్చే సోమవారం కోర్టుకు హాజరు కావాల్సిందిగా వారి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌కు హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. లేదం టే కోర్టుకు సహకరించేందుకు న్యాయవాదిని తామే నియమిస్తామని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు