ఎంపిక పూర్తి

4 Feb, 2014 02:25 IST|Sakshi
  •  పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్రే తరువాయి
  •   నెలాఖరుకు బీజేపీ జాబితా
  •   శివమొగ్గ నుంచి పోటీ చేయాలని యడ్డిపై ఒత్తిడి
  •   శివకుమార్, రాఘవేంద్ర, బసవరాజులపై సస్పెన్షన్ ఎత్తివేత
  •   బసవరాజుకు మళ్లీ తుమకూరు టికెట్ ఇవ్వాలని అప్ప డిమాండ్
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, ఈ నెలాఖరుకు జాబితాను విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై సోమవారం పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 28 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశామని, దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర పడాల్సి ఉందని తెలిపారు.
     
    యడ్యూరప్పపై ఒత్తిడి
     
    ఎన్నికల్లో శివమొగ్గ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై సమావేశంలో నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు. యడ్యూరప్పను పోటీ చేయించాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయనను అనునయించడానికి నాయకులు ప్రయత్నించారు. ఇటీవల యడ్యూరప్ప పోటీకి విముఖత వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ భాను ప్రకాశ్ నాయకత్వంలో శివమొగ్గ నుంచి వచ్చిన పార్టీ జిల్లా ప్రతినిధుల కమిటీ యడ్యూరప్పను ఆయన నివాసంలో కలుసుకుంది.

    ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చింది. కోర్ కమిటీ సమావేశానికి ముందు యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడుతూ శివమొగ్గ అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదన్నారు. పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థిని ఎంపిక చేస్తారని, పోటీ చేయాలంటూ తనపై ఒత్తిడి వస్తున్న మాట నిజమేనని ఆయన వివరించారు. మరో వైపు దక్షిణ కర్ణాటకలోని అభ్యర్థుల ఎంపికపై తీవ్ర చర్చ జరిగింది. గెలిచే సామర్థ్యం ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
     
    సస్పెన్షన్ ఉపసంహరణ
     
    యడ్యూరప్ప కేజేపీని స్థాపించినప్పుడు ఆయనకు మద్దతునిచ్చారనే కారణంతో బీజేపీ నుంచి శివ కుమార్ ఉదాసి, బీవై. రాఘవేంద్ర, జీఎస్. బసవరాజులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. యడ్యూరప్ప కుమారుడైన రాఘవేంద్ర శివమొగ్గ, మాజీ మంత్రి సీఎం. ఉదాసి కుమారుడైన శివ కుమార్ ఉదాసి హావేరి, బసవరాజ్ తుమకూరుల నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బసవరాజుకు మళ్లీ తుమకూరు టికెట్ ఇవ్వాలని సమావేశంలో యడ్యూరప్ప డిమాండ్ చేసినట్లు తెలిసింది. ప్రహ్లాద జోషి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్, ఎంపీ అనంత కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు