కేన్సర్‌ను తరిమేయడంలో ముందుంటా

20 Feb, 2014 23:02 IST|Sakshi
కేన్సర్‌ను తరిమేయడంలో ముందుంటా

   రోగులకు సరైన చికిత్స అందడంలో నావంతు సహాయసహకారాలందిస్తా
     సహచారీ ఫౌండేషన్ సంస్థ కోసం నిధులు సేకరిస్తా: మనీషా కొయిరాల
 
 న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి మనీషా కొయిరాల కేన్సర్ బాధితులకు తనవంతు సహాయసహకారాలందించనుంది. కేన్సర్‌ను తరిమేయడంలో అందరికంటే ముందుంటానని స్వయంగా కేన్సర్ బాధితురాలైన మనీషా పేర్కొంది. ఇందుకోసం సహచారీ ఫౌండేషన్ సంస్థ కోసం నిధులు సేకరిస్తానని చెప్పింది. ‘కేన్సర్ వ్యాధిబాధితుల చికిత్స కోసం ఏం చేయడానికైనా నేను ముందుంటా. ఈ పనిచేసే అవకాశం వస్తే గర్వంగా ఫీలవుతా. ఎందుకంటే కేన్సర్ వల్ల కలిగే బాధ ఏంటో నేను స్వయంగా అనుభవించాను. అందుకే బాధితులకు అండగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ వ్యాధి సోకినవారు దాని నుంచి బయటపడాలంటే చికిత్స ప్రక్రియ సక్రమంగా జరగడమే ముఖ్యం. అందుకోసం నావంతు సహాయసహకారాలందిస్తా’నని గురువారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పింది.
 
  రొమ్ము కేన్సర్ సోకిన మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన జాకెట్లను సహచారీ ఫౌండేషన్ సంస్థ తరఫున టాటా మెమోరియల్ ఆస్పత్రిలోని మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మనీషా  మాట్లాడుతూ... ‘ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ జాకెట్లు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని  నింపుతాయని భావిస్తున్నా. కేన్సర్‌తో పోరాడేందుకు, దాని నుంచి బయటపడేందుకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే నమ్మకం నాకుంది. సహచారీ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ విషయమై నన్ను సంప్రదించారు. తమ సంస్థ చేస్తున్న ఈ మంచిపనికి సహాయసహకారాలు అందించాల్సిందిగా కోరారు. నేను వెంటనే అంగీకరించాను. కేన్సర్ నుంచి బయటపడడంలో యోగా కూడా నాకు ఎంతగానో తోడ్పడింద’ని చెప్పింది.
 
  ‘డిజైన్ వన్’ పేరుతో లోధీ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రముఖ డిజైనర్లను ఒక్కచోటుకు తీసుకొచ్చింది. వారి సహాయంతో కేన్సర్ రోగులకు సాయమందించేందుకు నిధులను సేకరిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ డిజైనర్లు పంకజ్, నిధి, మయాంక్, శ్రద్ధా, అత్సు సెఖోసె, ఫల్గుని మెహతా, రీనాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు