నిమ్స్ నేర్పే నడకలివీ... | Sakshi
Sakshi News home page

నిమ్స్ నేర్పే నడకలివీ...

Published Thu, Feb 20 2014 10:49 PM

నిమ్స్ నేర్పే నడకలివీ...

కాలికి చిన్న గాయమైతేనే విలవిలలాడిపోతాం.  మరి జీవితాంతం కాళ్లు లేకుండా జీవించేవారి సంగతేంటి? మరొకరి సాయం లేకుండా, కూర్చున్నచోట నుంచి కదల్లేని వారి బాధలకు విముక్తి ఏంటి? ఏ వైద్యుడు వారి లోపాన్ని సవరించగలరు? ‘కొత్తకాలుని ఇవ్వలేం కానీ, కృత్రిమ కాలుని ఇవ్వగలమంటూ’ నాలుగు దశాబ్దాలక్రితమే  నిమ్స్ వైద్యులు ముందుకొచ్చారు. హైదరాబాద్‌లోని  నిమ్స్(నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్మెడికల్ సెన్సైస్) కృత్రిమ అవయవ నిర్మాణ కేంద్రం గురించి ప్రత్యేక కథనం.
 
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లినపుడు అక్కడ వర్క్‌షాపు పేరుతో ఉండే ‘కృత్రిమ అవయవ నిర్మాణ కేంద్రం’లోకి వెళితే ఓ పదిమంది సిబ్బందితో కాలిపర్స్ తయారీ పనిని చూడొచ్చు.  పోలియో బాధితులంతా కాలిపర్స్‌కోసం,. ప్రమాదాల్లో కాలునిపోగొట్టుకున్నవారంతా జైపూర్‌లెగ్ కోసం వస్తారక్కడికి. ఇప్పటివరకూ ఆ కేంద్రంలో  30 వేలమంది వికలాంగులకు కృత్రిమ కాళ్లను(లైట్‌వేట్ కాలిపర్స్, జైపూర్ పాదాలు) అమర్చారు.

ఇవి కాకుండా గత ఇరవైఏళ్లలో  దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో నిమ్స్ ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవ క్యాంపుల ద్వారా 35వేల మంది వికలాంగులకు ఉచితంగా లైట్‌వెయిట్ కాలిపర్స్‌ని అమర్చారు. ఒక పక్క కేంద్రంలో కాలిపర్స్‌ని తయారుచేస్తూ మరో పక్క పేషెంట్లకు బిగిస్తూ ఇంకోపక్క క్యాంపులకు వెళుతూ సేవల్ని అందిస్తున్న ఆ కేంద్రం సిబ్బందిలో ఒకరైన వెంకటేష్‌ని పలకరిస్తే...‘‘ఇన్ని వేలమందికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అమర్చిన ఏకైక కేంద్రం ఇది. ముప్పై నలభై ఏళ్లక్రితం పోలియోబాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది.

వారందరికీ కృత్రిమ కాళ్లను అమర్చిన ఈ కేంద్రాన్ని స్థాపించి నలభై ఏళ్లు దాటిపోయింది. 1970లో నెలకొల్పిన ఈ కేంద్రంలో నిమ్స్ సిబ్బందితో పాటు ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహాయ సహకార సంఘం సభ్యులు కూడా ఉంటారు. ఇద్దరూ కలిసి ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారన్నమాట. రెండు గ్రూపులు మారి ఒకరు ఇక్కడ కేంద్రంలో చూసుకుంటే మరో గ్రూపు ఇతర ప్రాంతాల్లో క్యాంపుల్ని ఏర్పాటుచేస్తోంది.

మన రాష్ర్టంలో మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ ప్రాంతాల్లో వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి తండాల్లోకి వెళ్లి క్యాంపులు ఏర్పాటు చేసి కృత్రిమ అవయవదానం చేశాం. మేం ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగా నిమ్స్ పర్యవేక్షక బృందం వెళ్లి స్క్రీనింగ్ చేసి వస్తుంది. అక్కడ ఎంతమంది వికలాంగులు ఉన్నారు....ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో సమాచారం సేకరిస్తుంది. దాన్నిబట్టి మేం మెటీరియల్ తీసుకెళ్లి వారికి కావాల్సిన సైజుల్లో కాలిపర్స్‌ని తయారుచేసి వారి కాళ్లకు అమరుస్తామన్నమాట’’ అని చెప్పారాయన.
 
జైపూర్‌పాదాలు కూడా...

జైపూర్‌ఫుట్ అక్కడ తప్ప ఇంకెక్కడా దొరకని రోజుల్లో నిమ్స్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి కృత్రిమ అవయవ కేంద్రంపై ఆ ఫుట్‌ని తయారుచేసిన పీకే సేథికి ఉన్న నమ్మకమే అందుకు కారణం అంటారు నిమ్స్ డెరైక్టర్ డా రవీంద్రనాథ్.   ‘‘మూడు దశాబ్దాలక్రితం జైపూర్‌ఫుట్‌ని మనకి పరిచయం చేసిన పీకే సేథీ దాన్ని అమర్చడంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. దాని తయారి ఎంత గొప్పదో అమర్చేవిధానం కూడా అంతే ముఖ్యమైనదని ఆయన అభిప్రాయం.

దేశంలో ఏ ఆసుపత్రికీ జైపూర్‌ఫుట్ అమర్చే అవకాశాన్ని ఇవ్వలేదాయన. అలాంటి సమయంలో నిమ్స్ కృత్రిమ అవయకేంద్రం పనితీరు చూసి ఇక్కడికి జైపూర్‌ఫుట్‌ని పంపించారు. ఆ ఫుట్‌ని అమర్చడం కోసం  ఇక్కడ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.  అప్పటికి ఇక్కడ చెక్కకాలు మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ తర్వాత 1992-93లో అందుబాటులోకి వచ్చిన తేలికపాటి కాలిపర్ దేశంలోనే పెద్ద సంచలనం సృష్టించింది. అంతకు ముందు వాటిస్థానంలో ఇనుపబద్దెలతో చేసిన బరువైన కాలిపర్స్ ఉండేవి.

దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగులకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో నేను క్యాంపుల ఏర్పాట్లను ప్రోత్సహించాను. అది విజయవంతం అయిందనడానికి గత ఇరవైఏళ్లలో మేం అమర్చిన 35 వేల కాలిపర్లే సాక్ష్యం’’ అని వివరించారు డాక్టర్ రవీంద్రనాథ్. నిజమే! ఆసుపత్రికి వచ్చిన వికలాంగులకు కాలిపర్లు అమర్చడం గొప్ప విషయం కాకపోవచ్చు కానీ మారుమూల పల్లెల్లో నెలలతరబడి క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి వికలాంగులకి కాలిపర్లు అమర్చడం మాత్రం ఒక్క మన నిమ్స్ కృత్రిమ అవయవ కేంద్రం సిబ్బంది ప్రత్యేకత మాత్రమే కావొచ్చు.
 
- భువనేశ్వరి, ఫొటోలు: పి. వెంకట్
 
 పన్నెండేళ్లయింది...

 నా పేరు ఉమారాణి. మాది నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర కోమటికుంట గ్రామం. పోలియోవల్ల రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. చెక్కకాళ్లతో నడిచేదాన్ని. నిమ్స్ ఆసుపత్రిలో నా కాళ్లకు ఈ కాలిపర్ అమర్చి నేటికి పన్నెండేళ్లవుతోంది. ఇప్పటివరకూ ఏ ఇబ్బందిలేకుండా పనిచేసింది.
 
 ‘‘కృత్రిమపాదం అవసరమైనవాళ్లు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుత్రికి వస్తే ముందుగా వైద్యులు పరీక్షలు చేసి వర్‌‌కషాపుకి పంపుతారు. పోలియో బాధితులకు లైట్ వెయిట్ కాలిపర్, కాలు లేనివారికి జైపూర్‌పాదాన్ని మీకు కావాల్సిన కొలతల మేరకు సిద్ధం చేస్తారు.  లైట్‌వెయిట్ కాలిపర్ బయట ఎక్కడైనా కొనుక్కోవాలంటే ఐదు వేల రూపాయల పైనే ఉంటుంది. అలాగే జైపూర్‌పాదం ఖరీదు పది వేల రూపాయల పైమాటే.  నిమ్స్‌లో మాత్రం ఈ కృత్రిమ పాదాలను ఉచితంగానే అమరుస్తారు’’
 -డాక్టర్ ఎల్ రవీంద్రనాథ్, డెరైక్టర్ నిమ్స్  
 
 ఇరవై ఏళ్లక్రితం...

 నా పేరు సబిత. హైదరాబాద్ చింతల్‌బస్తీలో ఉంటాను. ఇరవైఏళ్లక్రితం నా కుడికాలికి ఏదో చిన్న కురుపులా వచ్చి బాగా పెద్దగా అయిపోయింది. డాక్టర్లు కాలు తీసేశారు. చాన్నాళ్లు మంచంపైనే ఉండిపోయాను. అప్పుడు నిమ్స్‌లో జైపూర్‌ఫుట్ పెడుతున్నారని తెలిసి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ లెగ్‌తోనే నడుస్తున్నాను.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement