ఆస్పత్రినే కబ్జా చేశాడు

30 Aug, 2016 15:37 IST|Sakshi
15 ఏళ్లుగా అందులోనే నివాసం
 నెలన్నర క్రితమే కబ్జా
 ఆస్పత్రి గోడ కూల్చి.. ఇంటి నిర్మాణం 
 బరితెగించిన పశుసంవర్ధక శాఖ అటెండర్
 కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గావ్‌లో అక్రమం
 వైద్యులు మెమోలిచ్చినా పట్టించుకోని వైనం
 ఉన్నతాధికారుల అండదండలతోనే..?
 
సాక్షి, మంచిర్యాల : అతనో సాధారణ ఉద్యోగి. పశుసంవర్ధక శాఖలో అటెండర్. అదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గావ్‌లోని సబ్‌సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. చెప్పుకోవడానికి అతని పోస్టింగ్ చిన్నదే.. అయినా పెద్ద ఘనకార్యమే చేశాడు. అందరు ఖాళీ స్థలాలు కబ్జా చేస్తే.. అతను ఏకంగా తను విధులు నిర్వర్తించే ఆస్పత్రినే కబ్జా చేసేశాడు. అధికారులేమంటారోనన్న భయం లేకుండానే బరితెగించాడు. 1998లో ఆ ప్రాంతానికి బదిలీపై వచ్చిన అతను పదిహేనేళ్ల నుంచి ఈజ్‌గావ్ సబ్‌సెంటర్లోనే నివాసముంటున్నాడు. మధ్యలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా.. ఈజ్‌గావ్‌లోనే ఉంటూ రాకపోకలు సాగించేవాడు. ఏళ్ల నుంచీ సబ్‌సెంటర్లోని రెండు గదుల్లో ఉంటున్న అతను ఏకంగా ఆస్పత్రిపైనే కన్నేశాడు. నెలన్నర క్రితమే.. గోడను కూల్చి మరీ ఆస్పత్రిని కుదించాడు. మిగిలిన సగ భాగంలో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇంటి చుట్టూ తడకలు కట్టుకుని.. సున్నం వేసుకున్నాడు. సకల సౌకర్యాలు ఏర్పర్చుకుని దర్జాగా నివాసముంటున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన పైస్థాయి అధికారుల మాటలు బేఖాతర్ చేస్తూ వచ్చాడు. చివరకు కాగజ్‌నగర్ వైద్యుడు విజయ్‌కుమార్ ఇచ్చిన మెమోకూ విలువ లేకుండా చేశాడు. ‘ఎవరి అనుమతితో ఆస్పత్రి గోడను కూల్చావు..? మిగిలిన సబ్‌సెంటర్లో ఇల్లు నిర్మించుకునే అధికారం నీకెవరిచ్చారు..?’ అని ప్రశ్నించినా పట్టించుకోలేదంటూ ఆ సబ్‌సెంటర్‌లో విధులు నిర్వర్తించే జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ మధునమ్మ, కాగజ్‌నగర్ వైద్యుడు విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
అటెండర్ చేపట్టిన అక్రమ నిర్మాణంపై గత నెల 12న మధునమ్మ డాక్టర్ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సదరు వైద్యుడు అదే నెల 16న మంచిర్యాల డివిజన్ అసిస్టెంట్ డెరైక్టర్ కుమారస్వామికి ఫిర్యాదు చేశారు. ఏడీ ఆదేశాల మేరకు.. డాక్టర్ విజయ్‌కుమార్ మళ్లీ పూర్తి విచారణ చేపట్టి.. అదే రోజు సదరు అటెండర్‌కు మెమో జారీ చేశారు. గత నెల 18న ఏడీ కుమారస్వామికి విచారణ నివేదిక అందజేశారు. అదే రోజు ఏడీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డెరైక్టర్ ప్రేమ్‌దాస్‌కు పూర్తి వివరాలతో కూడిన నివేదిక చేరింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. మళ్లీ సమగ్ర విచారణ చేపట్టి.. వివరాలతో నివేదిక ఇవ్వాలని జేడీ కార్యాలయం నుంచి ఏడీ కుమారస్వామికి సమాచారం అందింది. ఏడీ కుమారస్వామి.. స్వయంగా ఈజ్‌గావ్ వెళ్లి విచారణ చేపట్టారు. ఆగస్టు 2న జేడీ కార్యాలయానికి సమగ్ర విచారణ నివేదిక అందజేశారు. విచారణ నివేదిక చేరి ఇరవై రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు అక్రమార్క అటెండర్‌పై చర్యలు తీసుకోకపోవడం అదే శాఖలో అనుమానాలకు తావిస్తోంది. పశుసంవర్ధక శాఖ జిల్లా కార్యాలయంలో అతనికి పలుకుబడి ఉండడంతోనే అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
 
పదిహేనేళ్ల నుంచీ ఇక్కడే మకాం..
1975లో ఈజ్‌గావ్‌లో పశుసంవర్ధక శాఖ సబ్‌సెంటర్ నిర్మాణానికి 2 గుంటల స్థలం అక్కడి గ్రామ పంచాయతీ ఇచ్చింది. ఆ స్థలంలో మొత్తం నాలుగు గదుల నిర్మాణం చేపట్టి.. పశుసంవర్ధక శాఖ సబ్‌సెంటర్ కొనసాగిస్తున్నారు. అయితే.. సబ్‌సెంటర్‌కు అప్పట్లో రెండు గదులే ఎక్కువవ డంతో.. మిగిలిన రెండు గదులు కార్యాలయ అటెండర్‌కు కేటాయించారు. ఇదే క్రమంలో 1998 నుంచి సదరు అటెండర్ అందులో ఉంటున్నాడు. మధ్యలో బదిలీ అయినప్పుడు ఈజ్‌గావ్ నుంచి రాకపోకలు సాగించేవాడు. ఆరేళ్ల క్రితం ఈజ్‌గావ్‌లో బాధ్యతలు చేపట్టిన అతను అప్పట్నుంచీ క్రమంగా ఇంట్లో వసతులు సమకూర్చుకున్నాడు. చివరకు నెలన్నర క్రితమే ఆస్పత్రి గోడను కూల్చి మధ్యలో మరో గోడను నిర్మించే శాడు. తర్వాత మిగిలిన సగం భాగంలో ఇంటి ప్రహరిని నిర్మించుకున్నాడు.
 
చర్యలు తీసుకుంటాం..
ఈజ్‌గావ్ సబ్‌సెంటర్లో కొంత భాగాన్ని అందులో పనిచేసే అటెండరే కబ్జా చేశాడ ని నాకు ఫిర్యాదు అందింది. మంచిర్యాల జేడీతో విచారణ చేపట్టాం. నాకు నివేదిక అందింది. అటెండర్‌పై చర్యలు తీసుకునే విషయంలో ఇంకా సమయం ఉంది. ఆలస్యమైనా చర్యలు తీసుకుంటాం.
- ప్రేమ్‌దాస్, జాయింట్ డెరైక్టర్, పశుసంవర్ధక శాఖ
మరిన్ని వార్తలు