వెలవెలబోతున్న హోటళ్లు

4 Jun, 2014 22:41 IST|Sakshi
వెలవెలబోతున్న హోటళ్లు

సాక్షి, ముంబై: బాబా పుణ్యక్షేత్రం షిర్డీలో వ్యాపారం వెలవెలబోతోంది. బసచేసే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో హోటళ్లు, లాడ్జీలకు ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో వాటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే షిర్డీలో సౌకర్యాల లేమీయే దీనికి కారణమని తెలుస్తోంది. తిరుపతి తరువాత అత్యధిక శాతం భక్తులు వచ్చే పుణ్యక్షేత్రంగా షిర్డీ పేరు గాంచింది. షిర్డీ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. గత రెండేళ్ల కాలంలో బాబాను దర్శించుకునే వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కానీ హోటల్, లాడ్జింగ్‌లు మాత్రం వెలవెలబోతున్నాయి.  షిర్డీలో సుమారు 400పైగా చిన్న, పెద్ద హోటళ్లు, లాడ్జింగులు ఉన్నాయి. అందులో వందకు పైగా విలాసవంతమైన, రెండు, ఐదు నక్షత్రాల హోటళ్లు ఉన్నాయి.

 దాదాపు అన్ని హోటళ్లలో సాగానికిపైగా గదులు ఖాళీగానే ఉంటున్నాయి. ఫలితంగా వాటి యజమనులు నష్టాల బాట పడుతున్నారు. అంతేకాదు ఇప్పటికే 50కిపైగా వాటిని విక్రయించారు. మరో 50 హోటళ్లు, లాడ్జింగ్‌లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నిజానికి ఏడాదికి హోటళ్లు, లాడ్జింగుల్లో ఉన్న గదుల్లో 50-60 శాతం వరకు భక్తులు అద్దెకు దిగాలి. అప్పుడే యజమానాలకు గిట్టుబాటు అవుతుంది. కానీ 30-40 శాతం మాత్రమే భక్తులు అద్దెకు దిగడంతో నష్టపోవాల్సి వస్తుంది. దీనికి తోడు బాబా సంస్ధాన్ ద్వారా షిర్డీలో అనేక చోట్ల అద్దె గదులు నిర్మించారు. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. దీంతో షిర్డీకి వచ్చే భక్తులు చౌక ధరకు లభించే బాబా సంస్థాన్ నిర్మించిన గదుల్లోనే బస చేస్తున్నారు. దీంతో వీరి పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా మారింది.

 ఇటీవల సంస్థాన్ ఏసీ గదుల అద్దెను రూ.900 నుంచి రూ.500 తగ్గించింది. అదేవిధంగా సాధారణ గదుల అద్దె రూ.500 నుంచి రూ.200 తగ్గించింది. దీంతో పోటీ మరింత తీవ్రమైంది. దీని ప్రభావం ప్రైవేటు హోటల్, లాడ్జింగ్ వ్యాపారులపై పడింది. దుబాయికి చెందిన ఇద్దరు వ్యాపారులు రెండు స్టార్ హోటళ్లను కొద్ది సంవత్సరాల కోసం లీజుకు తీసుకున్నారు. అయితే భక్తులు అటువైపు చూడకపోవడంతో కేవలం ఆరు నెలల్లోనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఇలా అనేక మంది డిపాజిట్ చెల్లించి లాడ్జింగ్‌లను నడిపేందుకు తీసుకున్నారు. కాని గిట్టుపాటు కాకపోవడంతో డిపాజిట్‌ను వదులుకుని అర్ధంతరంగా వెళ్లిపోయారు. మరికొందరు బ్యాంకులనుంచి రుణాలు తీసుకుని హోటళ్లు, లాడ్జింగులు నిర్మించారు. బ్యాంక్ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారు. 20-30 శాతం డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ వ్యాపారాలు సాగడం లేదు. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

మరిన్ని వార్తలు