శ్రీకారం..

16 Oct, 2016 02:08 IST|Sakshi
శ్రీకారం..

 సాక్షి, చెన్నై :కూడంకులం అణు విద్యుత్ కేంద్రం ఆవరణలో మూడు, నాలుగు యూనిట్ల పనులకు శనివారం శ్రీకారం  చుట్టారు. గోవా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ పనుల్ని ప్రారంభించారు. ఇక, రెండో యూనిట్‌లో ఉత్పత్తి వేగం పెరగడం విశేషం. తిరునల్వేలి జిల్లా కూడంకులంలో భారత్, రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అణు విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుతున్న విషయం తెలిసిందే. రెండో యూనిట్‌లో ఉత్పత్తికి శ్రీకారం చుట్టినా, కొన్ని సాంకేతిక కారణాలతో తరచూ ఉత్పత్తిని నిలుపుదల చేసి, మరలా కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కేంద్రం ఆవరణలో రూ. 39 వేల కోట్లతో మూడు, నాలుగో యూనిట్ల ఏర్పాటుకు రెండు దేశాల మధ్య గతంలో ఒప్పందాలు కుదిరాయి. ఆ మేరకు ఆ యూనిట్ల పనులకు తగ్గ చర్యల్ని అణు విద్యుత్ శక్తి బోర్డు వర్గాలు తీసుకున్నాయి.
 
 ఈ పనులకు శ్రీకారం చుట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. ఎక్కడ అణు వ్యతిరేకుల నుంచి నిరసనలు బయలు దేరుతాయోనన్న ముందస్తు సమాచారంతో ఆ పరిసరాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గోవా నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పనుల్ని ప్రారంభించారు. ఈ సమయంలో మూడు, నాలుగు యూనిట్ల పనులకు శ్రీకారం చుడుతూ అణు విద్యుత్ కేంద్రం వర్గాలు ముందుకు సాగాయి. ఈసందర్భంగా భారత్, రష్యా శాస్త్ర వేత్తలు, ఇంజనీర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుతిన్, మోదీలతో మాట్లాడారు. అదే సమయంలో గత కొద్ది రోజులుగా  ఆగి ఉన్న  రెండో యూనిట్ ద్వారా ఉత్పత్తి వేగాన్ని పెంచుతూ ముందుకు సాగారు.
 
 ఈ విషయంగా కూడంకులం అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ, ఒకటో యూనిట్ ద్వారా వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సాగుతున్నదన్నారు. రెండో యూనిట్ ద్వారా తమకు అణు శక్తి కమిషన్ యాభై శాతం మేరకు మాత్రమే ఉత్పత్తికి తగ్గ అనుమతి ఇచ్చి ఉన్నట్టు పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో  ఆ శాతాన్ని పెంచనున్నారని, ఆ మేరకు పూర్తి స్థాయిలో కొన్ని నెలల వ్యవధిలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఆ యూనిట్ ద్వారా దక్కుతుందన్నారు. ప్రస్తుతం, మూడు, నాలుగు యూనిట్ల పనులకు చర్యలు తీసుకున్నామని, పనుల వేగం పెంచనున్నామని వివరించారు. ఈ పనుల్ని 2022 నాటికి ముగించేవిధంగా ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు