ఐటీ ఉద్యోగాల పేరిట హైటెక్ ఛీటింగ్

10 Oct, 2013 03:35 IST|Sakshi

= ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీ పేరిట ఇంటర్‌నెట్‌లో హల్‌చల్
 = కంపెనీ లోగో, ముఖ్యుల సంతకాలు ఫోర్జరీ
 = ఏసీ హోటళ్లలో ఇంటర్వ్యూలు
 = 600 మందికి నకిలీ నియామక పత్రాలు అందజేత
 = ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు రూ. 30 వేలు వసూలు
 = ఆర్డర్‌‌సతో అసలైన కంపెనీ ముందు బారులు తీరిన నిరుద్యోగులు
 = .. ఆ ఉత్తర్వులను చూసి కంగుతిన్న అసలు కంపెనీ
 = పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

 
 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో ఐటీ ఉద్యోగాల వేటలో పలు సార్లు వంచనకు గురవుతున్నా ఇంజనీరింగ్ పట్టభద్రులకు దీనిపై ఇంకా సరైన అవగాహన ఏర్పడడం లేదు. ఉద్యోగం వస్తుందనే ఆత్రుతలో పలు నకిలీ కంపెనీల మాయలో పడి నిత్యం మోసపోతున్నారు. ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల్లో రి క్రూట్‌మెంట్ ఎలా ఉంటుందనే విషయమై అవగాహన ఏర్పరచుకుంటే మోసపోకుండా జాగ్రత్త పడవచ్చు. అయినప్పటికీ నకిలీ కంపెనీలు పలు మాయోపాయాలతో ఐటీ ఉద్యోగార్థులను బోల్తా కొట్టిస్తున్నాయి.

ఏడాదిలో ఒకటి, రెండు పర్యాయాలు ఇలాంటి నకిలీ కంపెనీల గుట్టు రట్టవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీ పేరిట ఏసీ హోటళ్లలో ఇంటర్వ్యూలు నిర్వహించి, నకిలీ నియామక పత్రాలిచ్చిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నకిలీ కంపెనీని అసలైన కంపెనీగా పొరబడిన సుమారు 600 మంది ఉద్యోగార్థులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఆ కంపెనీ పేరిట ఈ-మెయిల్‌ను సృష్టించిన వంచకులు, అత్యంత చేతివాటాన్ని ప్రదర్శించి అదే కంపెనీ ల్యాండ్‌లైన్ ద్వారా ఉద్యోగార్థులకు ఫోన్ చేసిన తీరు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

నకిలీ నియామక పత్రాలను అసలైనవిగా భావించిన ఉద్యోగార్థులు వాటిని చేతబట్టుకుని ఉద్యోగాలు ఇవ్వాలంటూ అసలు కంపెనీ వద్ద బారులు తీరారు. తాము అలాంటి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పిన అధికారులు, అసలు విషయం తెలుసుకుని విస్తుపోయారు. వెంటనే అప్రమత్తమై సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంచకుల కోసం పోలీసులు బుధవారం వేటను ప్రారంభించారు.
 
అసలేం జరిగింది?

ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీ ‘కేపీఎంజీ’కి బెంగళూరు, హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా పది శాఖలున్నాయి. ఈ కంపెనీలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటూ వంచకులు ఇంటర్‌నెట్‌లో ప్రకటనలు గుప్పించారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగార్థులకు నగరంలోని ఓ హోటల్‌లో ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. careers@kpmgindia.-com అనే ఈ-మెయిల్ ద్వారా వ్యవహారాలను నడిపించారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌మెంట్‌ను చేపట్టినట్లు నమ్మబలికారు. రెండు సార్లు ఇంటర్వ్యూలను నిర్వహించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేసి కంపెనీ ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచే అభ్యర్థులకు కాల్స్ చేశారు.
 
కంపెనీ లోగో, ముఖ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి కేపీఎంజీ కార్యాలయం చిరునామాతో నియామక పత్రాలను అందజేశారు. ఈ క్రమంలో ఉద్యోగంపై కోటి ఆశలతో ఉన్న నిరుద్యోగులు ఒక్కొక్కరు సుమారు రూ.30 వేల వరకు వారికి సమర్పించుకున్నారు. ఈ-మెయిల్ ద్వారా అందిన నియామక ఉత్తర్వులను చేతబట్టుకుని అభ్యర్థులు నేరుగా అసలు కంపెనీ వద్దకు వెళ్లారు. ఆ కంపెనీ సిబ్బంది ఈ ఉత్తర్వులను చూసి ఖంగు తిన్నారు. హైదరాబాద్ శాఖ పేరిట గతంలో ఇలాంటి మోసం జరిగింది. గత ఆగస్టులో దీనిపై హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. అక్కడ వంచకులెవరో తెలియక ముందే అదే పంథాలో ఇక్కడా మోసం జరగడం కంపెనీ సిబ్బందిని నిశ్చేష్టులను చేసింది.
 
ఇంటర్వ్యూల్లో డబ్బులు అడగరు

ప్రతిష్టాత్మక కంపెనీల పేరిట మోసం చేయడం సర్వ సాధారణమై పోయిందని సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్‌పీ డీ. రూప తెలిపారు. రిక్రూట్‌మెంట్ల సందర్భంగా ఇంటర్వ్యూల్లో ఎవరూ డబ్బులు అడగరని చెప్పారు. అలా ఎవరైనా అడిగితే అభ్యర్థులు వెంటనే అప్రమత్తం కావాలని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు